అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ఇటీవల సినిమా నిర్మాణ వ్యయం హీరోల రెమ్యూనరేషన్ గురించి చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో సంచలనగా మారిన సంగతి తెలిసిందే. సినిమా బడ్జెట్లో హీరోల రెమ్యూనరేషన్ కేవలం పది నుంచి 20% మాత్రమే అని ఆయన నమ్మించే ప్రయత్నం చేశారు. వాస్తవంగా హీరోల రెమ్యునరేషన్లు సినిమాల బడ్జెట్ తో 30 నుంచి 40% వరకు ఉంటున్నాయి. స్టార్ హీరోల నుంచి మిడిల్ రేంజ్ హీరోల రెమ్యూనరేషన్లు సినిమా సినిమాకు జయాపజయలతో సంబంధం లేకుండా ఎలా పెరిగిపోతున్నాయో చూస్తూనే ఉన్నాం.
అంటే ఒక సినిమా బడ్జెట్ రూ.150 కోట్లు అనుకుంటే హీరో రెమ్యూనరేషన్ రూ.20 నుంచి 25 కోట్లు మాత్రమే అని అరవింద్ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణను ఒక్కడిని మినహాయిస్తే మిగిలిన హీరోల రెమ్యూనరేషన్లు చుక్కల్లోనే ఉంటున్నాయి. బాలకృష్ణ సినిమాలకు రూ.130 నుంచి రూ.150 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుంది. అయినా బాలయ్య రెమ్యూనరేషన్ ఇప్పటివరకు రూ.15 నుంచి రూ.18 కోట్ల రేంజ్ లో మాత్రమే ఉంది. ఇప్పుడు బాబీ సినిమాకు మాత్రమే రూ.20 కోట్ల పైన రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. బాలయ్య సినిమాల మార్కెట్ రేంజ్‌తో పోలిస్తే ఇది కూడా చాలా రీజనబుల్ రెమ్యునరేషన్.
ఇక అల్లు అరవింద్ బావమరిది మెగాస్టార్ చిరంజీవి, మెగా ఫ్యామిలీకి చెందిన మరో స్టార్ హీరో పవన్ కళ్యాణ్ సినిమాలకు కూడా ఇంచుమించు బాలయ్య రేంజ్ లోనే రూ.130 నుంచి రూ.150 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుంది. అయితే వాళ్ల రెమ్యూనరేషన్లు మాత్రం చుక్కల్లో ఉంటున్నాయి. చిరంజీవి రూ.50 నుంచి రూ.55 కోట్ల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటుంటే.. పవన్ కళ్యాణ్ అయితే బ్రో సినిమాకు రూ.65 కోట్ల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు ప్రచారం జరిగింది.
మరి అల్లు అరవింద్ చెప్పినట్టు చూసుకుంటే చిరంజీవికి రూ.20 కోట్లు.. పవన్ కళ్యాణ్ కు రూ.25 నుంచి రూ.30 కోట్ల లోపల మాత్రమే రెమ్యూనరేషన్ ఇవ్వాలి. భోళా శంకర్ లాంటి డిజాస్టర్ సినిమాకు చిరంజీవికి కూడా రూ.65 కోట్ల రెమ్యూనరేషన్‌తో పాటు లాభాల్లో వాటా అనుకున్నారు. అయితే ఆ సినిమా డిజాస్టర్ అవడంతో చిరంజీవి రూ.50 కోట్లు మాత్రమే తీసుకుని పై రెమ్యూనరేషన్ వెనక్కు ఇచ్చారని ప్రచారం ఉంది. దీనిని బట్టి అల్లు అరవింద్ హీరోల రెమ్యూనరేషన్‌పై ఎలాంటి పచ్చి అబద్దాలు చెప్పారో క్లియర్‌గా తెలుస్తోంది.
అలాగే ఆయన చెప్పిన మాటలు నిజం అయితే తమ మెగా ఫ్యామిలీకి చెందిన చిరంజీవి, పవన్ కళ్యాణ్ కి కూడా రూ.20 నుంచి రూ.25 కోట్లకు మించి రెమ్యూనరేషన్ ఇవ్వక్కర్లేదని.. వాళ్లకు అంత సీన్ లేదని పరోక్షంగా చెప్పారా ? అన్న ప్రశ్నలకు కూడా నెటిజెన్ల నుంచి ఆయనకు వెళుతున్నాయి. ఏది ఏమైనా టాలీవుడ్ హీరోల రెమ్యూనరేషన్ విషయంలో ఇప్పటికైనా మార్పు రాకపోతే నిర్మాతలకు ఒక్క రూపాయి లాభం కూడా వచ్చే పరిస్థితి లేదు. సినిమాలు తీసేందుకు పెద్దపెద్ద నిర్మాతలు కూడా భయపడే పరిస్థితి అయితే వచ్చేసింది.