శ్రీదేవి-చంద్రమోహన్ జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ పదహారేళ్ల వయసు. అసలు ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండానే విడుదలైంది. పైగా.. చంద్రమోహన్ కుంటి వేషంలో నటించారు. ఈ సినిమాలో కుంటి..కుంటి అనే పిలుస్తారు. ఇక, శ్రీదేవి బాల నటిగా గుర్తింపు ఉన్నప్పటికీ.. ఈ సినిమాతోనే తొలి హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. వాస్తవానికి ఈ సినిమాను శోభన్‌బాబుతో చేయాలనేది దర్శకుడు రాఘవేంద్రరావు ఆలోచన. అయితే.. కుంటిగా నటించడం ఇష్టంలేని శోభన్ బాబు స్క్రిప్టులో మార్పులు చేయాలని సూచించారు.
దీనికి రాఘవేంద్రరావు ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలోనే అనూహ్యంగా చంద్రబాబును నిర్ణయించడం.. ఆయన దానికి ఒప్పుకోవడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఇక, ఈ సినిమా విడుదలైన రెండు రోజుల వరకు కలెక్షన్లు లేవు. శ్రీదేవి పక్కన చంద్రమోహన్ ఏంటి? సో శాడ్! అనే టాక్ వచ్చేసింది. కానీ, సినిమా పాటలు.. మాటలు బయటకు వచ్చాక.. ఏకంగా 365 రోజులు ఆడేసింది. ఈ సినిమాలో మరో హైలెట్ మోహన్‌బాబు యాక్షన్. ఇక, ఈ సినిమా విజయం అయితే దక్కించుకుంది. కానీ, చంద్రమోహన్‌కు బ్యాడ్‌లక్ ప్రారంభమైంది.
పదహారేళ్ల వయసు తర్వాత.. అచ్చం అలాంటి క్యారెక్టర్లే ఆయన తలుపు తట్టాయట. ముఖ్యంగా తమిళంలోనూ ఇలాంటివే వచ్చాయట. దీంతో ఆయన చాలా రోజులు గ్యాప్ తీసుకున్నారు. ఇదిలావుంటే.. ఆయన బ్యాడ్ లక్‌కు మరో కారణం హైట్ అని అంటారు. మరో అడుగు ఎత్తు ఉండి ఉంటే.. ఎన్టీఆర్ , ఏఎన్నార్ కంటే కూడా.. చంద్రమోహన్ వెండితెరను ఏలేసేవారని చెబుతారు. కానీ, ఆయన హైట్ లేకపోవడంతో జయప్రదతోనూ.. శ్రీదేవితోనూ.. జయసుధతోనూ.. తొలి సినిమాలకే హీరోగా పరిమితం అయ్యారు. అయితే..ఆ సినిమాలు సూపర్ హిట్ కావడం గమనార్హం.
ఇదే విషయాన్ని అక్కినేని నాగేశ్వరరావు కూడా.. అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. చంద్రమోహన్ ఒక్క అడుగు ఎత్తుంటేనా.. నేను మావూరెళ్లి.. వ్యవసాయం చేసుకునేవాడిని! అని అక్కినేని చమత్కరించేవారట. అన్నగారు ఎన్టీఆర్ కూడా ఇదే మాట చెప్పేవారట. మొత్తానికి హైట్ లేదనే చింత చంద్రమోహన్‌కు ఉన్నప్పటికీ.. సినిమాల పరంగా ఆయన ఎక్కడా వెనుదిరిగి చూసుకోలేదని అంటారు. ఆయన మన మధ్య లేకపోయినా.. పాత కొత్త సినిమాలు చూస్తే..ఆ యన కనిపించకుండా మాత్రం ఉండరు.