టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల ఖుషి సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ఈ సినిమాలో సమంత హీరోయిన్ అయినా కూడా ఖుషి ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ – పరశురామ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తయిందని సంక్రాంతి విడుదల ఫిక్స్ అని తెలుస్తోంది.
ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్లో 13వ సినిమా.. అటు దిల్ రాజు బ్యానర్ లో 54 సినిమాగా తెరకెక్కుతోంది. అయితే విజయ్ దేవరకొండ గతంలో చాలాసార్లు మావాడు అంటే మహేష్.. మావాడు అని ఫిక్స్ అయిపోతాం.. మేము కాలేజీ రోజుల్లో మహేష్ ను మనోడ్రా అరే మహేష్ రా అని ఫీలయ్యామని గతంలో చాలా సార్లు చెప్పాడు.
అయితే ఇప్పుడు మహేష్ బాబు గుంటూరు కారం సినిమా కేవలం ఏపీ, తెలంగాణలోనే 120 కోట్ల టార్గెట్ తో సంక్రాంతి కానుకగా బాక్సాఫీస్ బరిలోకి దిగుతుంది. గుంటూరు కారం సినిమాకు పోటీగా రవితేజ ఈగిల్ – తేజ సజ్జ హనుమాన్ – వెంకటేష్ సైంధవ్ సినిమాలు ఉన్నాయి. సందట్లో సడేమియాలా విజయ్ దేవరకొండ సినిమా కూడా సంక్రాంతికి అంటున్నారు. అటు నాగార్జున నా సామి రంగ సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ అని ప్రకటించారు.
ఇన్ని సినిమాల మధ్యలో విజయ్ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయడం అవసరమా అని మహేష్ అభిమానులు నిట్టూరుస్తున్నారు. కేవలం గుంటూరు కారం సినిమా ఏపీ, తెలంగాణలో 120 కోట్ల టార్గెట్ అంటే చాలా ఎక్కువ.. అలవైకుంఠపురంలో సినిమాను మించి సూపర్ హిట్ అయితే గాని ఆ రేంజ్ వసూళ్లు రావు. విజయ్ తన సినిమాను పోస్ట్ పోన్ చేసుకుంటే గుంటూరు కారంకు రికార్డులు ఈజీ అవుతాయని.. ఇప్పటికే మూడు నాలుగు సినిమాలు రిలీజ్ ఉండగా మధ్యలో విజయ్ కూడా దూరెయ్యాలా అన్న చర్చలు ఇండస్ట్రీ, ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి.