హాస్య నటుడు రేలంగి వెంకట్రామయ్య గురించి నేటి తరానికి తెలియకపోయినా.. పాతతరం ప్రేక్షకులకు మాత్రం ఆయన గురించి బాగానే తెలుసు. ఆయన హీరోలతో సమానంగా కొన్నిసార్లు.. అంతకన్నా ఎక్కువ గానే ఎక్కువ సార్లు పారితోషికం తీసుకున్నారు. సినిమా ప్రపంచంలో అన్ని అనుభవాలను ఆయన గడిం చారు. 24 ప్రేమ్స్‌లో ఆయనకు అభినివేశం ఉంది. దర్శకత్వం వహించకపోయినా.. తన పాత్రలను ఆయనే దర్శకుడు కూడా అవసరం లేకుండా నటించేవారు.
ఇక, మేకప్ విషయంలోనూ.. రేలంగికి ఎవరి సాయం అక్కరలేదు. అసిస్టెంట్ దర్శకుడి దగ్గర పాత్ర గురించి తెలుసుకునేవారు. అంతే.. తనే వెళ్లి నేరుగా మేకప్ వేసుకునేవారు. ఇదే విషయం ఎల్వీ ప్రసాద్ అనేక సందర్భాల్లో చెప్పేవారు. రేలంగి ఉంటే… మేకప్‌మ్యాన్ అవసరం లేదు. ఆ ఖర్చు మాకు మిగిలేదని అనేవారు. అంతేకాదు.. నిర్మాతలకు ఆయన సలహాలు , సూచనలు కూడా ఇచ్చేవారు. ఎక్కడ ఖర్చు తగ్గించుకోవాలో చెప్పేవారు.
ఇలా.. సినిమాల్లో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న రేలంగి.. రెమ్యునరేషన్‌గా వచ్చిన సొమ్ముతో కొత్త కొత్త కార్లు కొనుగోలు చేసేవారు. ఏ కారునైనా. ఆయన రెండేళ్లకు మించి ఉంచుకునేవారు కాదు. అప్పట్లో విదేశీ కార్లు.. కొనుగోలు చేయడంలో ఎస్వీ రంగారావు, సావిత్రిల మధ్య పోటీ ఉండేది. తర్వాత కాలంలో రేలంగి వీరిని మించిపోయారు. ఇలా.. ఆయన ఓ సారి.. తాను కొత్త కారు కొన్నానని..రేపు స్టూడియోకు తీసుకువస్తా నని చెప్పారు.
అంతేకాదు.. భారీ ఎత్తున పార్టీ కూడా ఇస్తానని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దీంతో మరుసటి రోజు రేలంగి తీసుకువచ్చే కారు చూసేందుకు ఆర్టిస్టులు అందరూ క్యూ కట్టారు. అయితే.. కొత్తకారు ఇంటికి వచ్చినా.. దానిని 12 కిలో మీటర్ల దూరంలోని స్టూడియోకు తీసుకురావాలంటే.. డ్రైవర్ కావాలి. అప్పటి వరకు పనిచేస్తున్న డ్రైవర్ ఆకస్మికంగా అదే రోజు సెలవు పెట్టాడు.తనకేమో.. డ్రైవింగ్ రాదు. దీంతో ఏం చేయాలో రేలంగికి తోచలేదు. ఇదే విషయం సావిత్రికి ఫోన్ చేసి చెప్పడంతో ఆమె తన డ్రైవర్‌ను పంపించి.. రేలంగి కొత్తకారును నడిపేలా చేశారట. మొత్తానికి తొలి రోజు ముచ్చట అలా తీరిందని అనేవారు రేలంగి.