సినిమాల్లో ఎంత అగ్ర హీరోలు, అగ్రతారలు అయినా వారు చేసిన పాత్రల ప్రభావంతో కొన్ని కొన్ని నిక్ నేమ్స్ అలాగే ఉండిపోతాయి. ఇలాంటి వారిలో ప్రముఖ నర్తకి గానే కాకుండా కొన్ని సినిమాలలో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన రాజ సులోచన ఒకరు. రాజ సులోచన అసలు పేరు రాజలోచన. ఆమె తల్లిదండ్రులకు లేఖ లేక పుట్టిన ఏకైక బిడ్డ కావడంతో ఆమెను వారు ఎంతో గారాబంగా పెంచుకున్నారు. ఈ క్రమంలోనే అప్పట్లో రాజా అనే పదం గౌరవంగా ఉండటంతో ఆమె పేరుకు ముందు రాజా చేర్చి రాజాలోచన అని పెట్టారు.
అయితే ఆమెను స్కూల్లో జాయిన్ చేసే సమయంలో ఆమె పేరును తప్పుగా అర్థం చేసుకున్నారో ఏమో తెలియదు కానీ.. పొరపాటుగా రాజ సులోచన అని రాశారు. ఆప్పటి నుంచి ఆమె పేరు రాజ సులోచనగా మారిపోయింది. రాజ సులోచనకు డ్యాన్స్ అంటే ప్రాణం. ఒకే ఒక కుమార్తె కావడంతో తల్లిదండ్రులు ఆమెను నచ్చినట్టు ప్రోత్సహిస్తూ వచ్చారు. సినిమాల్లోకి వచ్చిన ఆమెకు తొలి పాత్ర వేశ్య పాత్ర దక్కింది. ఈ పాత్రలో నటించేందుకు తండ్రికి ఇష్టం లేకపోయినా తల్లి ప్రోత్సాహంతో చేశారు.
ఆ తర్వాత కాలంలో రాజ సులోచనపై వేశ్య పాత్రలో నటించే నటిగా ముద్ర పడిపోయింది. వరుస పెట్టి వేశ్య పాత్రలు చేయాల్సి వచ్చింది. ఇవి తప్ప ఇంకేమీ రావా ? అనే ప్రశ్న రాజ సులోచనను వెంటాడింది.
అయినా ఆమె సర్దుకుపోయారు. దీంతో ఆమె బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడ ఎవరు కలిసినా మీరు ఆ సినిమాలో వేసే పాత్రలో జీవించారు. మీకు వేశ్య పాత్రలు బాగా సూట్ అవుతున్నాయి. మా సినిమాలలో వేశ్య పాత్రలలో నటిస్తారా ?అని అడిగేవారట. అలా వేశ్య పాత్రలు మాత్రమే వేశ్య హీరోయిన్ అన్న ముద్ర రాజ సులోచనపై పడిపోయింది.
ఇది ఆమె వ్యక్తిగత జీవితంలో కూడా చాలా ఇబ్బందులకు కారణమైంది. అయితే కొన్నాళ్లకు ఎన్టీఆర్ ఆమెకు బందిపోటు సినిమాతో హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆప్పటి నుంచి ఎన్టీఆర్, రాజ సులోచన కాంబినేషన్లో నాలుగు సినిమాలు వచ్చాయి. అవన్నీ ఆమెకు మంచి పేరు తీసుకువచ్చాయి. ఆ తర్వాత ఆమె క్యారెక్టర్ పాత్రలు కూడా వేశారు. అలా వేశ్య పాత్రలో నటించే నటీమణిగా ముద్ర పడిపోయిన రాజ సులోచనను హీరోయిన్ చేసిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుంది.