Newsతెర‌వెన‌కే కాదు.. న‌టులుగా స‌త్తా చాటుతోన్న టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్లు వీళ్లే..!

తెర‌వెన‌కే కాదు.. న‌టులుగా స‌త్తా చాటుతోన్న టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్లు వీళ్లే..!

నటీనటులు వెండితెర మీద మెరిస్తే దర్శకుడు అనేవాడు అన్ని శాఖలను ముందుండి నడిపిస్తాడు. ఓ యాక్టర్ నుంచి ఎంత పెర్ఫార్మన్స్ రాబట్టాలో అనేది డైరెక్టర్ వర్క్. అయితే ఇప్పుడు చాలామంది దర్శకులు కాస్తా యాక్టర్లుగా మారుతున్నారు. ఇది టాలీవుడ్ లో ఎప్పటినుంచో ఉంది. దర్శకరత్న దాసరి నారాయణరావు ఎంత గొప్ప డైరెక్టర్ అంతే గొప్ప నటుడు. ఇక సీనియర్ దర్శకుడు కే రాఘవేంద్రరావు సైతం పెళ్లి సందడి సినిమాతో తెరమీద కనిపించారు.

ఇక ఇటీవల నటులుగా మారుతున్న దర్శకుల విషయానికొస్తే ఫ్యామిలీ సినిమాల‌ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల పెదకాపు 1 సినిమాలో విలన్ గా నటించారు. ఈ పాత్ర కోసం ముందు ఒక మలయాళ నటుడిని అనుకున్నారు. ఆయన సడన్‌గా తప్పుకోవడంతో శ్రీకాంత్ విలన్ గా వెండితెర మీద కనిపించారు. పలాస 1978 దర్శకుడు కరుణ్ కుమార్ ప్రస్తుతం మట్కా మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈయ‌న నాగార్జున నా సామీ రంగ సినిమాలో విలన్ గా కనిపించబోతున్నారు.

ఇక తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు సినిమాతో దర్శకుడుగా మారారు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది. తర్వాత ఈ నగరానికి ఏమైంది కూడా దర్శకత్వం వహించారు తరుణ్. ఆ తర్వాత విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి మీకు మాత్రమే చెప్తాను అనే సినిమా రూపొందించారు. ఈ సినిమాలో హీరోగా తరుణ్ భాస్కర్ ని సెలెక్ట్ చేసుకున్నారు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.

ఇక సీనియర్ దశకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఫ్యామిలీ సబ్జెక్టులతో ఎన్నో సూపర్ డూపర్ హిట్లు కొట్టారు. తెలుగు ప్రేక్షకులకు ముందుకు హీరోగా రావాలన్న తన కోరికను ఉగాది సినిమాతో తీర్చుకున్నారు. ఆ తర్వాత అభిషేకం మూవీతో మరోసారి హీరోగా ట్రై చేశారు. అయితే ఈ సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు. తమిళ‌ సినీ పరిశ్రమకు భారీ విజయాలు అందించిన దర్శకులు అంతా ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా.. విలన్లుగా మారుతున్నారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ – సముద్రఖ‌ని – ఎస్ జె సూర్య – మిస్కిన్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఇక పాత తరంలో దాసరి నారాయణరావు తర్వాత కే విశ్వనాథ్, కోడి రామకృష్ణ, ఆర్ నారాయణ మూర్తి లాంటి వాళ్లు కూడా వెండితెర మీద హీరోలతో పాటు రకరకాల పాత్రలలో మెప్పించినవారే..!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news