అందరూ ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న తెలంగాణ ఎన్నికల తేదీలు వచ్చేసాయి. నవంబర్ 30న తెలంగాణ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 2న కౌంటింగ్ ఉంటుంది. అంటే డిసెంబర్ 5 తో అన్ని పూర్తవుతాయి. కీలకమైన హైదరాబాద్ నగరం ఉన్న తెలంగాణ సినిమా మార్కెట్‌కు చాలా కీలకం. ఇప్పుడు అందరూ ఎన్నికల హడావుడిలో ఉంటారు. అక్టోబర్లో మిగిలిన 20 రోజులు.. నవంబర్ నెల అంతా సినిమాలపై దృష్టి పెట్టే అంత తీరిక ఎవరికీ ఉండదు. ఎవరికి వారు ఎన్నికల ప్రచారంలో మునిగిపోతారు.
హైదరాబాదులోనూ ఇదే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా మిగిలిన చోట్ల కూడా మాస్ జనాలు అందరూ ఎన్నికల ప్రచారం వైపు ఎన్నికల చర్చల్లో మునిగితేలుతూ ఉంటారు. ఇలాంటి టైంలో సినిమాలు రిలీజ్ చేసేందుకు టాలీవుడ్ ఇష్టపడటం లేదు. సినిమాకు ఎంత మంచి టాక్ వచ్చిన కలెక్షన్లపై ఎక్కడ ఎఫెక్ట్ పడుతుందో ? అన్న సందేహం వారిలో ఉంది. ఎవరైనా సినిమాలు రిలీజ్ చేసుకోవాలంటే డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి హ్యాపీగా చేసుకోవచ్చు.
ఈ క్రమంలో డిసెంబర్ ఫస్ట్ వీక్ తర్వాత టాలీవుడ్ క్రేజీ సినిమాలు రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ వీక్ లో ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ – నాని హాయ్ నాన్న సినిమాలు లైన్లో ఉన్నాయి. ఈ రెండు సినిమాలు డిసెంబర్ తొలి వారం లేదా రెండో వారంలో థియేటర్లలోకి దిగనున్నాయి. ఈ ఇద్దరు యంగ్ హీరోలు.. పైగా ఇద్దరవి క్రేజీ సినిమాలు కావటంతో నాని – నితిన్ మధ్య సమరంలో ఎవరు పై చేయి సాధిస్తారు అన్న ఉత్కంఠ అయితే ఉంది.
ఇక సైంధవ్ సినిమా డిసెంబర్ మూడో వారంలో రిలీజ్ కావాల్సి ఉంది. అప్పుడే సలార్ రిలీజ్ అవుతుండడంతో సైంధవ్ సంక్రాంతికి వెళ్ళిపోయింది. ఏది ఏమైనా ఎన్నికల వేడి ఉండే ఈ 50 రోజులు టాలీవుడ్ లో సినిమాల సందడి అయితే ఉండదని చెప్పాలి. ఇక డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి మళ్లీ సినిమాల హంగామా మొదలవుతుంది.