MoviesTL రివ్యూ: భ‌గ‌వంత్ కేస‌రి.. బాల‌య్య విశ్వ‌రూపం.. అనిల్ రావిపూడి రాత‌...

TL రివ్యూ: భ‌గ‌వంత్ కేస‌రి.. బాల‌య్య విశ్వ‌రూపం.. అనిల్ రావిపూడి రాత‌ వీక్‌… తీత‌ టాప్‌

బ్యాన‌ర్‌: షైన్ స్క్రీన్స్‌
టైటిల్‌: భ‌గ‌వంత్ కేస‌రి
నటీనటులు: నంద‌మూరి బాల‌కృష్ణ‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, శ్రీలీల‌, అర్జున్ రామ్‌పాల్ త‌దిత‌రులు
సినిమాటోగ్ర‌ఫీ: సీ. రామ్‌ప్ర‌సాద్‌
మ్యూజిక్‌: థ‌మ‌న్ ఎస్‌.ఎస్‌
ఎడిటింగ్‌: త‌మ్మిరాజు
యాక్ష‌న్‌: వి. వెంక‌ట్‌
ఎగ్జిగ్యూటివ్ నిర్మాత‌: ఎస్‌. కృష్ణ‌
నిర్మాతలు: సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది
దర్శకుడు : అనిల్ రావిపూడి
రిలీజ్ డేట్‌: 19 అక్టోబ‌ర్‌, 2023
సెన్సార్ రిపోర్ట్‌: యూ / ఏ
ర‌న్ టైం: 163 నిమిషాలు

TL ప‌రిచ‌యం :
నందమూరి నటసింహం బాలకృష్ణ చాలా ఏళ్ల తర్వాత కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్లో ఉన్నాడు. అఖండ, వీరసింహారెడ్డి లాంటి రెండు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల తర్వాత ఈరోజు భగవంత్‌ కేసరి సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ఇటు బుల్లితెరపై అన్‌స్టాప‌బుల్ క్రేజ్.. అటు వెండితెరపై రెండు వరుస సూపర్ డూపర్ హిట్లు.. పైగా టాలీవుడ్ లో అసలు అపజయం అన్నదే లేకుండా ఆరు వరుస సూపర్ డూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకుడు. బాలయ్యకు జోడిగా తొలిసారిగా కాజల్ హీరోయిన్గా నటించింది. యంగ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల బాలయ్య కూతురు పాత్రలో కనిపించింది. సంగీతంతో థియేటర్లలో మోత మోగించేస్తున్న తమన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఇలా చూసుకున్న భగవంత్ కేసరి సినిమాపై ఉన్న అంచనాలు ఆకాశాన్ని దాటేసాయి. పైగా బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన సినిమా కూడా భగవంత్ కేసరి. ఇన్ని అంచనాలు.. ఆశలతో ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ?మెప్పించిందో TL సమీక్షలో చూద్దాం.

క‌థ‌:
ఆదిలాబాద్ ఫారెస్ట్‌లో పోలీస్ ఇన్‌స్పెక్ట‌ర్‌గా ఉద్యోగం చేసుకునే నేల‌కొండ భ‌గ‌వంత్ కేస‌రి ( బాల‌య్య‌) జైలు శిక్ష ఎందుకు అనుభ‌విస్తాడు ? భ‌గ‌వంత్ జీవితంలో వ‌చ్చిన విజ్జీ పాప ( శ్రీలీల‌) ఎవ‌రు ? ఆమె కోసం భ‌గ‌వంత్ ఎవ‌రికి ఏమి మాట ఇచ్చాడు ? ఆ మాట కోసం భ‌గ‌వంత్ త‌న జీవితాన్ని ఎలా త్యాగం చేశాడు ? మ‌ధ్య‌లో కాచ్చీ కాత్యాయ‌ని ( కాజ‌ల్ అగ‌ర్వాల్ ) ఎవ‌రు ? దేశంలోనే నెంబ‌ర్ 1 పారిశ్రామిక‌వేత్త‌గా ఉన్న రాహుల్ సింగ్వీ ( అర్జున్ రామ్‌పాల్‌)తో బాల‌య్య‌కు ఎందుకు వైరం వ‌స్తుంది ? అస‌లు వీరిద్ద‌రి మ‌ధ్య ఉన్న పాత ప‌గ ఏంటి ? చివ‌ర‌కు విజ్పీ పాప విష‌యంలో భ‌గ‌వంత్ తాను అనుకున్న‌ది సాధించాడా ? రాహుల్ సింఘ్వీ త‌న‌కు చేసిన అన్యాఆయానికి భ‌గ‌వంత్ ఎలా ప‌గ తీర్చుకున్నాడు ? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మే ఈ సినిమా స్టోరీ.

TL విశ్లేష‌ణ‌ :
ఫ‌స్టాఫ్‌లో శ్రీలీల – బాల‌య్య స‌న్నివేశాల‌తో పాటు శ్రీలీల‌ను ల‌క్ష్యం దిశ‌గా న‌డిపించేందుకు బాల‌య్య చేసే విఫ‌ల ప్ర‌య‌త్నాలు.. కాజ‌ల్‌తో ఫ‌న్నీ ల‌వ్ ఎపిసోడ్ ట్రాక్‌తో మంచి స్కోర్ చేశాడు. ఇక ఇంట‌ర్వెల్‌కు ముందు 40 నిమిషాల నుం చిచి సినిమా స్పీడ్ అందుకుంటుంది. అస‌లు రాహుల్ సింఘ్వీకి బాల‌య్య‌కు మ‌ధ్య గ‌తంలోనే ఎందుకు శ‌త్రుత్వం ఉంద‌న్న ట్విస్ట్ రివీల్ అవ్వ‌డం జ‌రుగుతుంది. సినిమా స్టార్టింగ్‌లోనే భ‌గ‌వంత్ కేస‌రి జైలు నుంచి రిలీజ్ కావ‌డం… విజ్జీ పాప‌ను పెంచే బాధ్య‌త తీసుకోవ‌డం… అటు దేశంలోనే భారీ పారిశ్రామిక‌వేత్త రాహుల్ సంఘ్వీ దేశంలో ఉన్న పోర్టుల‌న్నింటిని త‌న ఆధీనంలోకి తీసుకునే కాంట్రాక్ట్ ద్వారా దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ అయ్యే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్ట‌డంతో క‌థ మొద‌లవుతుంది.

ఈ ప్ర‌య‌త్నంలో త‌న కొడుకు చ‌చ్చిపోయినా కూడా రాహుల్ సింఘ్వీ ప‌ట్టించుకోడు. ఎలాగైనా శ్రీలీల‌ను ఆర్మీ ఆఫీస‌ర్‌ను చేయ‌ల‌న్న ఆమె తండ్రి చ‌నిపోయే ముందు కొరిన కోరిక మేర‌కు బాల‌య్య ప‌డే క‌ష్టం.. అటు మొండిఘ‌టం అయిన శ్రీలీల అస్స‌లు భ‌గ‌వంత్‌ను ప‌ట్టించుకోకుండా ప్రేమ‌లో ప‌డ‌డం.. బాల‌య్య ఆవేశంతో ఆ పెళ్లి క్యాన్సిల్ అవ్వ‌డం.. అటు శ్రీలీల నువ్వు న‌న్ను ఇక ఇడిసేయ్ చిచ్చా అని ఎమోష‌న‌ల్ అవ్వ‌డం ఇవ‌న్నీ ప్రేక్ష‌కుడిని ఎమోష‌న‌ల్‌గా క‌నెక్ట్ చేస్తాయి. నా లైఫ్ మీద నీ పెత్త‌నం ఏంది… నాకు న‌చ్చిన‌ట్టు బ‌త‌క‌నీయ్‌… నాకు ఆర్మీ గీర్మి వ‌ద్దు.. నేను పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌లో ఉండాల‌నుకుంటున్నాన‌ని క‌న్నీళ్లు పెట్టుకునే సీన్ ప్ర‌తి ఒక్క‌రిని మ‌న‌స్సును హ‌త్తుకునేలా చేసింది. చిన్న‌ప్ప‌టి నుంంచి ఎత్తుకుని పెద్ద చేసిన త‌న విజ్జీపాప తండ్రి లెక్క పెంచిన వ్య‌క్తినే దూరం పెట్టేయ‌డం… అదే టైంలో ఆమె రిస్క్‌లో ప‌డ‌డం… ఆమెను సేవ్ చేసేందుకు చేస్తోన్న ప్ర‌య‌త్నాల‌కు ఆమే ఆడ్డుప‌డ‌డం ఇలా ద‌ర్శ‌కుడు క‌థ‌ను న‌డిపిన తీరు ఉత్కంఠ‌గా ఉంది.

బాల‌య్య – శ్రీలీల కాంబినేష‌న్లో వ‌చ్చిన సాంగ్‌లో ఇద్ద‌రు క‌లిసి వేసిన స్టెప్పులు చాలా క‌ల‌ర్ ఫుల్‌గా ఉన్నాయి. ఈ సాంగ్‌ను థియేట‌ర్ల‌లో ఉన్న ప్ర‌తి ఒక్క‌రు ఎంజాయ్ చేసేలా ఉంది. ఈ వ‌య‌స్సులోనూ శ్రీలీల‌తో పోటీప‌డుతూ బాల‌య్య వేసిన డ్యాన్స్ మూమెంట్స్ అదిరిపోయాయి. భ‌గ‌వంత్ గారు ఇక్క‌డ బ్యూటిఫుల్ నైట్‌.. అక్క‌డ మూన్ లైట్ చేతిలో ఐస్ క్రీం అని కాజ‌ల్ చెప్పే రొమాంటిక్ డైలాగ్ బాగుంది. బాల‌య్య‌ను లైన్లో పెట్టేందుకు కాజ‌ల్ ప‌డ‌ర‌ని పాట్లు ఫ‌న్నీగా ఉన్నాయి. నేను చెప్పా కాచీ.. కాత్యాయ‌నీ అంటూ బాల‌య్య ఆమెను ఆట‌ప‌ట్టించ‌డం బాగా పేలింది. కాజ‌ల్ బాల‌య్య ల‌వ్ ట్రాక్‌లో కామెడీ బాగా వ‌ర్క‌వుట్ అయ్యింది. సెకండాఫ్‌లో భారీ ఫైరింగ్ గ‌న్‌ను కాద‌ని గ్యాస్ సిలిండ‌ర్ల‌ను వాడి విల‌న్ల‌ను ప‌రిగెత్తించే ఫైట్ సీన్ అల్టిమేట్‌.. సెకండాఫ్‌లో విల‌న్ – బాల‌య్య మ‌ధ్య బ‌ల‌మైన ఎత్తులు, పై ఎత్తుల‌తో కూడిన బ‌ల‌మైన సంఘ‌ర్ష‌ణ సీన్లు ఇంకా రాసుకుని ఉండాల్సింది. ఒక్కోచోట మ‌రీ బాల‌య్య వార్ వ‌న్‌సైడ్ షో న‌డిపిన‌ట్టుగా ఉంటుంది. డైలాగులు మాత్రం సినిమాలో ట‌న్నుల కొద్ది ఉన్నాయి. అయితే అందుకు త‌గ్గ బ‌ల‌మైన క‌థ లేకుండా పోయింది. అయితే తీత మాత్రం స్ట్రాంగ్‌గా ఉంది.

న‌టీన‌టుల పెర్పామెన్స్ :
న‌టీన‌టుల్లో బాల‌య్య‌లోని స‌రికొత్త న‌ట‌న చూస్తాం. బాల‌య్య అంటే యాక్ష‌న్‌, డైలాగులు మాత్ర‌మే కాదు.. స‌రికొత్త కామెడీతో పాటు ఎమోష‌న‌ల్‌, న‌డివ‌య‌స్సులో బాధ్య‌త క‌ల వ్య‌క్తిగా అద్భుత‌మైన న‌ట‌న క‌న‌పరిచాడు. అటు కామెడీతో పాటు కామెడీ యాక్ష‌న్‌లోనూ అద‌ర‌గొట్టేశాడు. శ్రీలీల – బాల‌య్య మ‌ధ్య వ‌చ్చే ఎమోష‌న‌ల్ సీన్లలో బాల‌య్య న‌ట విశ్వ‌రూప‌మే చూపించాడు. బాల‌య్య త‌ర్వాత చెప్పుకోవాల్సింది శ్రీలీల పాత్రే. ఫ‌స్టాఫ్‌లో అల్ల‌రి చిల్ల‌రి కాలేజ్ పిల్ల‌గా… త‌ర్వాత బాల‌య్య‌ను అపార్థం చేసుకునే యువ‌తిగా… ఆ త‌ర్వాత చ‌నిపోయిన త‌న తండ్రి ల‌క్ష్యం కోసం ప‌రిణితి చెందిన అమ్మాయిగా ఎలా మారిందో చెప్పే సీన్ల‌లో అద‌ర‌గొట్టేసింది. ఇంకా చెప్పాలంటే ఈ పాత్ర శ్రీలీల కెరీర్‌లోనే ఎప్ప‌ట‌కి గుర్తుండిపోతుంది.

శ్రీలీల‌కు కెరీర్ స్టార్టింగ్‌లోనే చాలా గొప్ప పాత్ర రావ‌డం.. అందులోని న‌ట‌న ఆమెలో స‌రికొత్త కోణాన్ని ఆవిష్క‌రించింది. ఈ సినిమాలో కాజ‌ల్ – బాల‌య్య మ‌ధ్య ల‌వ్ నేప‌థ్యంలో వ‌చ్చే ఫ‌న్నీ సీన్లు త‌ప్పా ఆమె వ‌ల్ల సినిమాకు ఒరిగిందేమి లేదు. అస‌లు సినిమాలో కాజ‌ల్ లేక‌పోయినా వ‌చ్చిన న‌ష్టం లేదు. ఇక విల‌న్ అర్జున్ రామ్‌పాల్ ఎందుకో బాల‌య్య‌కు స‌రిపోలేద‌నిపించింది. చూడ‌డానికి మాత్ర‌మే ప‌వ‌ర్ ఫుల్‌గా ఉన్నా… ప‌ర‌మ రొటీన్ విల‌న్ మాదిరిగానే క‌నిపించాడు. మిగిలిన న‌టుల్లో సుబ్బ‌రాజు, శివాజీతో పాటు ఇత‌రులు పాత్ర‌ల గురించి చెప్పుకోవ‌డానికేం లేదు. సినిమాలో బాల‌య్య లేని ఒక్క ఫ్రేమ్ కూడా ఊహించుకోలేం. దాదాపు ప్ర‌తి సీన్‌, ప్ర‌తి ఫ్రేమ్ అంతా బాల‌య్య చుట్టూ.. బాల‌య్య వ‌న్ మ్యాన్ షోలా న‌డ‌వ‌డంతో ఇత‌రుల పాత్ర‌ల గురించి మ‌రీ గొప్ప‌గా చెప్పుకోలేం.

టెక్నిక‌ల్‌గా ఎలా ఉందంటే….
టెక్నిక‌ల్‌గా థ‌మ‌న్‌కు మంచి మార్కులే వేయాలి. మ‌రీ అఖండ రేంజ్‌లో కాక‌పోయినా సినిమాను చూసి ఎంజాయ్ చేస్తూ నేప‌థ్య సంగీతం ఇచ్చిన‌ట్టుగా ఉంది. అయితే ఒక‌టి ఆరా సీన్ల‌లో పాత ఆర్ ఆర్ వాస‌న‌లు క‌నిపించాయి. ఉన్న రెంటు పాట‌లు విన‌డానిక‌న్నా తెర‌మీద చూడ‌డానికి బాగున్నాయి. సీ రామ్‌ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ బాల‌య్య సినిమా అంటేనే ప్రాణం పెట్టి ప‌నిచేస్తాడు. ఈ సినిమాలో సీన్లు కూడా సీన్ల‌కు త‌గ్గ‌ట్టుగానే ఉన్నాయి. ఎక్కువ క్లోజ‌ప్ షాట్లే కావ‌డంతో మరీ క‌ష్ట‌ప‌డ‌డానికేం లేదు.

వెంక‌ట్ యాక్ష‌న్ అదిరిపోయింది. సినిమాలో ఫ‌స్ట్ ఫైట్‌తో మొద‌లు పెట్టి ఇంట‌ర్వెల్ ఫైట్‌… సెకండాఫ్‌లో ఫైట్ల‌తో పాటు క్లైమాక్స్ అదిరిపోయేలా యాక్ష‌న్ సీన్లు ఉన్నాయి. బాల‌య్య ఫ్యాన్స్‌కు మాత్ర‌మే కాదు.. యాక్ష‌న్‌, మాస్ జ‌నాల‌కు పిచ్చెక్కించేలా యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీ ఉందనే చెప్పాలి. ఎడిట‌ర్ త‌మ్మిరాజు ఎడిటింగ్ ఫ‌స్టాఫ్ కంటే సెకండాఫ్‌లో బాగా క్రిస్పీగా ఉంది. ఫ‌స్టాఫ్‌లో శ్రీలీల‌తో పాటు క‌థ‌లోకి వెళ్లేముందు కొంత బోరింగ్ అనిపించినా.. ఆ మాత్రం శ్రీలీల బాల్యం చూపించ‌కుండా క‌ట్ చేసినా బాగోద‌నిపించింది. ఇక షైన్ స్క్రీన్ బ్యాన‌ర్ నిర్మాణ విలువ‌లు అదిరిపోయాయి. సినిమాకు కావాల్సిన‌ట్టుగా ఖ‌ర్చు పెట్టారు.

ఇక ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి గ‌త సినిమాల‌కు భిన్నంగా.. త‌న కామెడీ ట్రాక్‌ను ప‌క్క‌న పెట్టేసి ఓ సీరియ‌స్ యాక్ష‌న్ క‌థ‌ను బాల‌య్య‌తో చెప్పాల‌నుకున్నాడు. అనిల్ అనుకున్న ఆలోచ‌న మంచిదే అయినా అందుకు త‌గిన‌ట్టుగా బ‌ల‌మైన క‌థ రాసుకోలేదు. అనిల్ రాత వీక్‌గా ఉన్నా… తీత‌లో మాత్రం గ్రిప్పింగ్ అందుకున్నాడు. అందుకే భ‌గ‌వంత్ కేస‌రిలో బ‌ల‌మైన క‌థ లేక‌పోయినా తీత‌లో స‌క్సెస్ అయ్యి ప్రేక్ష‌కుల‌ను అన్ని విధాలా క‌నెక్ట్ చేసింది.

ప్ల‌స్ పాయింట్స్ ( + ) :

  • బాల‌య్య వ‌న్ మ్యాన్ షో
  • బాల‌య్య – శ్రీలీల ఎమోష‌న‌ల్ సీన్లు
  • నేప‌థ్య సంగీతం
  • బ్రేకుల్లేకుండా సూటిగా క‌థ‌ను చెప్ప‌డం
  • యాక్ష‌న్ సీన్లు

మైన‌స్ పాయింట్స్ ( – ) :

  • ఫ‌స్టాఫ్‌లో కొన్ని బోరింగ్ సీన్లు
  • అనిల్ రావిపూడి వీక్ రైటింగ్‌

ఫైన‌ల్‌గా…
తెలుగు సినిమా అంటే హీరోయిన్ల‌ను పెట్టుకుని… బ‌ల‌వంతంగా నాలుగు కుప్పిగంతులు వేయ‌డం మాత్రమే కాదు… 60 ఏళ్లు దాటిన సీనియ‌ర్ హీరోలు.. క్యారెక్ట‌ర్‌కు ఇంపార్టెన్స్ ఇస్తూ క‌థాబ‌లం ఉన్న సినిమాలు చేయాలి… అలా చేసి ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తే ఎలా ఉంటుందో ? ఈ సినిమాతో బాల‌య్య చేసి చూపించాడు. వ‌య‌స్సుకు త‌గ్గ‌ట్టుగా బాధ్య‌త‌తో కూడిన పాత్ర‌లో బాల‌య్య ఒదిగిన తీరు అద్భుతం. బాల‌య్య, మాస్‌ అభిమానులు మాత్ర‌మే కాదు… మ‌హిళ‌లు, కుటుంబ ప్రేక్ష‌కులు కూడా చూసే సినిమా.

భ‌గ‌వంత్ కేస‌రి ఫైన‌ల్ పంచ్ : యాక్ష‌న్ + ఎమోష‌న‌ల్ క‌ల‌బోతే ఈ భ‌గ‌వంత్ కేస‌రి

భ‌గ‌వంత్ కేస‌రి రేటింగ్‌: 3 / 5

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news