రీ ఎంట్రీ ఇచ్చాక చిరంజీవి కెరీర్ పరంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్న మాట వాస్తవం. చిరంజీవి పదేళ్లపాటు సినిమాలకు గ్యాప్ తీసుకుని 2017లో వచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. తర్వాత ఐదారు సినిమాలలో చిరంజీవి నటించారు. ఖైదీ నెంబర్ 150 రీమేక్ సినిమా.. దానిని పక్కన పెడితే ఆయనకు వచ్చిన ఏకైక హిట్ సినిమా వాల్తేరు వీరయ్య.. అది కూడా గొప్ప కథ, కథనాలు ఉన్న సినిమా కాదు. సంక్రాంతికి అలా ఆడేసింది అంతే..!
ఇక సైరా, ఆచార్య, గాడ్ ఫాదర్, భోళాశంకర్ ఇవన్నీ డిజాస్టర్లు. ఇవి పాత సినిమాలు మాత్రమే కాదు.. చిరంజీవి పరువు కూడా తీసేసాయి. అసలు భోళాశంకర్ లాంటి సినిమాలు చూసి మెగా అభిమానులే తలలు పట్టుకున్నారు. తర్వాత చిరంజీవి వరుసగా ప్లాప్ డిజాస్టర్ డైరెక్టర్ల వెంటపడుతున్న పరిస్థితి. వినాయక్‌ని తెలుగు సినీ జనాలు ఎప్పుడో మర్చిపోయారు. పిలిచి ఖైదీ నెంబర్ 150 సినిమాకు ఛాన్స్ ఇచ్చారు. మెహర్ రమేష్ గురించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో.. తెలుగు సినీ అభిమానుల్లో ఉన్న చర్చ తెలిసిందే. ఎవ్వరు దగ్గరకు రానిచ్చే పరిస్థితి లేదు.
కనీసం మెహర్ రమేష్ కథ చెబుతామన్న టైం ఇచ్చే హీరోలు ఎవరూ లేరు. అలాంటి దర్శకుడు తో సినిమా చేశాడు. వాస్తవంగా చెప్పాలంటే బాబి కూడా పెద్ద గొప్ప దర్శకుడు కాదు.. సురేందర్ రెడ్డి ఫామ్ లో లేకపోయినా సైరాతో ఛాన్స్ ఇచ్చారు. ఇక తెలుగులో అప్పుడప్పుడో హనుమాన్ జంక్షన్ సినిమా తీసిన మోహనరాజాతో గాడ్ ఫాదర్ సినిమా చేశారు. ఒక కొరటాల మాత్రమే వరుసహిట్లతో ఉన్నాడు. ఆయనతో ఆచార్య చేస్తే అదీ కలిసి రాలేదు. ఇదే టైంలో నాలుగు దశాబ్దాల చిరంజీవి కెరీర్ లో ఎన్నో సందర్భాలలో ఆయనతో పోటీపడిన మరో సీనియర్ హీరో బాలకృష్ణ. రీఎంట్రీ తర్వాత కూడా చిరంజీవి, బాలయ్య హోరాహోరీగా పోటీ పడుతున్నారు.
2017 సంక్రాంతికి వీరిద్దరి ప్రతిష్టాత్మక సినిమాలు ఖైదీ నెంబర్ 150 – గౌతమీపుత్ర శాతకర్ణి థియేటర్లలోకి వచ్చి రెండు సూపర్ హిట్ అయ్యాయి. మళ్ళీ ఈ ఏడాది సంక్రాంతికి ఇద్దరు వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలతో ప్రేక్షకులకు ముందుకు వచ్చి ఇద్దరు సూపర్ హిట్లు కొట్టారు. అయితే చిరంజీవి ప్లాప్ డైరెక్టర్లకు ఛాన్సులు ఇస్తూ వెళుతున్నారు. అదే టైంలో బాలయ్య వరుసగా హిట్ డైరెక్టర్లతో సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. బోయపాటి శ్రీను, మలినేని గోపిచంద్, అనిల్ రావిపూడి ఇప్పుడు బాబి ఆ తర్వాత మరోసారి బోయపాటి శ్రీను ఇలా బాలయ్య దర్శకుల లైనప్ చాలా పవర్ఫుల్ గా ఉంది.
అయితే వరుస ఎదురు దెబ్బల నేపథ్యంలో చిరు ఇప్పుడు కాస్త ట్రాక్ మార్చి.. బింబిసారతో తొలి సినిమాతోనే హిట్ కొట్టిన మల్లిడి వశిష్ట్‌కు ఛాన్స్ ఇచ్చారు. ఈ సినిమా కంటే ముందే కురసాల కళ్యాణ్‌కృష్ణ సినిమా ఉంది. అయితే ఆయన్ను పక్కన పెట్టేసి మరీ వశిష్టకు ఛాన్స్ ఇచ్చారు.