నందమూరి బాలకృష్ణ – అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన భగవంత్ కేసరి సినిమా నిర్మాణాంతర పనులు పూర్తిచేసుకుని దసరా కానుకగా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ అందరిని మెప్పించి సినిమాపై ఇప్పటివరకు ఉన్న అంచనాలు పెంచేసింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ గురించి ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన పరుచూరి పలుకుల్లో విశ్లేషించారు. సినిమా ఎంత గొప్పగా ఉంటుందో ట్రైలర్ లోనే చూపించడం కూడా ఒక అద్భుతమైన టాలెంట్ అన్నారు.
రెండు నిమిషాలకు పైగా నిడివి వున్న ఈ ట్రైలర్ చూస్తే అనిల్ రావిపూడి ఎంత టాలెంట్ ? ఉన్న దర్శకుడో అర్థమవుతుందని తెలిపారు. సాధారణంగా ఒక సినిమా సూపర్ హిట్ అయితే దాన్ని తర్వాత వచ్చే సినిమా గురించి హీరోలు, దర్శకులు కొంత టెన్షన్ పడుతూ ఉంటారు. అలాంటిది బాలకృష్ణ అఖండ – వీర సింహారెడ్డితో వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న తర్వాత భగవంత్ కేసరితో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
అలాంటప్పుడు ఎవరికైనా ఈ సినిమాపై అంచనాలు ఉంటాయి. అయితే ట్రైలర్ చూశాక అన్ని సందేహాలు తొలగిపోయి.. అభిమానుల్లో కేవలం ఉత్సాహం మాత్రమే కలిగే ఉందన్నారు. అఖండ తర్వాత బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్.. డైలాగ్ డెలివరీలో చాలా గొప్ప మార్పు వచ్చింది.. భగవంత్ కేసరి బాలకృష్ణకు సరిపోయే కథ. తండ్రీ కూతుర్ల కథలా అనిపిస్తోంది.. కూతురుని కాపాడటం కోసం తండ్రి పడే తపనను చూపిస్తున్నారని.. అలాగే బిడ్డ ముందు తండ్రి నిలబడితే 100 దేవుళ్ల లెక్క వంటి డైలాగులు అద్భుతంగా ఉన్నాయన్నారు.
దసరాకు రిలీజ్ అవుతున్న ఈ సినిమా బాలకృష్ణ అభిమానులకు పండగ తెస్తుందని భావిస్తున్నా… సినిమా హిట్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్టు పరుచూరి తెలిపారు. ఇప్పటికే భగవంత్ కేసరి ట్రైలర్ 17 మిలియన్లకు పైగా వ్యూస్ తో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది.