బోయపాటి శ్రీను స్వతహాగా మంచి మనసున్న వ్యక్తి. ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా ఆయన పని ఆయన చేసుకుపోతూ ఉంటారు. అన్నిటికీ మించి బాలయ్య లాంటి హీరోలకు తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్లు ఇవ్వడంతో నందమూరి అభిమానులు.. బాలయ్య అభిమానులు తెలుగుదేశం పార్టీ క్యాడర్ బోయపాటిని నెత్తిన పెట్టుకుంటుంది. అయితే బోయపాటి ఒక్కోసారి నోటి దూల ప్రదర్శిస్తూ ఉంటారు. తానే అంతా గొప్ప అన్న అహం ప్రదర్శిస్తూ ఉంటారు.
లెజెండ్ సినిమా సక్సెస్ మీట్ లో వేదిక మీదే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇచ్చే విషయంలో బద్ధకంతో ఉంటాడు.. తానే దగ్గరుండి పట్టుబట్టి దేవిశ్రీ తో ఆర్ఆర్ చేయించుకున్నాను అని కాస్త గర్వంతో మాట్లాడారు. వెంటనే దేవిశ్రీ బోయపాటి చేతిలో మైక్ తీసుకుని కౌంటర్ ఇచ్చి పడేసాడు. బోయపాటి గారు మిక్సింగ్ జరుగుతుంటే హాలీవుడ్ సినిమాలు.. ఇంగ్లీష్ సినిమాలు చూస్తూ కూర్చుంటారు.. తన వర్క్ గురించి తనకి ఎవరూ చెప్పక్కర్లేదు.. తన పని తాను పర్ఫెక్ట్ గా చేస్తానని చెప్పారు.
తాజాగా బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమా స్కంద. ఈ సినిమా ప్రమోషన్లలో బోయపాటి మాట్లాడుతూ అఖండ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన తమన్ నేపథ్య సంగీతాన్ని తక్కువ చేసేలా మాట్లాడారు. అఖండ అంత పెద్ద సక్సెస్ అవటం వెనక ప్రధాన కారణం తమన్ ఇచ్చిన నేపథ్య సంగీతం కూడా ఒకటి. తమన్ నేపథ్య సంగీతం దెబ్బతో అనకాపల్లి నుంచి అమెరికా వరకు థియేటర్లలో పూనకాలు వచ్చేసాయి. అమెరికాలో చాలామంది థియేటర్ల యజమానులు సైతం తాము సౌండ్ తగ్గించి పెడుతున్నామని నోటీసు బోర్డులో పెట్టుకోవాల్సిన పరిస్థితి.
తమన్ మ్యూజిక్ దెబ్బతో థియేటర్లలో సినిమాలు చూస్తున్న ప్రతి ఒక్కరు ఊగిపోయారు. ఆ విషయం చిన్నపిల్లాడిని అడిగినా చెబుతారు. అలాంటి మ్యూజిక్‌పై బోయపాటి ఊహించిన కామెంట్స్ చేయటం అందరికీ షాకింగ్ గా మారింది. అఖండలో ఆ సీన్స్ ని ఎలాంటి బ్యాగ్రౌండ్ స్కోర్ లేకుండా చూసినా కూడా అంతే హైలో అనిపిస్తాయి.. అంత పవర్ ఫుల్ గా ఆ సన్నివేశాలు తీశాను అన్నట్టుగా తెలిపారు. అసలు అక్కడ ఆ సన్నివేశాలకు ప్రాణం పోసింది.. మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది తమన్ బీజీఎం.
అలాంటి తమన్ పనితనాన్ని తక్కువ చేసి బోయపాటి మాట్లాడటం చాలామందికి నచ్చలేదు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఏది ఏమైనా బోయపాటికి నోటి దూల కాస్త ఎక్కువే అన్న చర్చ ఇండస్ట్రీలోనూ.. సోషల్ మీడియాలో బాగా ఎక్కువగా వినిపిస్తోంది. మరి ఈ నోటిదలను ఆయన ఎప్పుడు తగ్గించుకుంటాడో చూడాలి.