ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు.. ఒకదశలో తెలుగు సినిమా రంగాన్ని కుదిపేశారంటే ఆశ్చ ర్యం వేస్తుంది. ఆయన తీసిన అనేక సినిమాలు సూపర్ హిట్లు సాధించాయి. కుటుంబ కథా నేపథ్యంలో రామోజీరావు చేసిన ప్రయోగాలు అన్నీ కూడా ప్రేక్షకులకు కనువిందు చేశాయి. ఇలాంటి వాటిలో మయూరి సినిమా ఒకటి. ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై.. రామోజీరావు చేసిన ఈ సినిమా ఏకంగా 18 భాషల్లో డబ్ అయింది.
రామోజీరావు ఏ సినిమా చేసినా… బడ్జెట్ తక్కువగా ఉండడమే కాకుండా.. కథకు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చేవారు. పదునైన మాటలు.. కథ, కథనం వంటివాటికి ప్రాణం పెట్టేవారు. ముఖ్యంగా ఆయన జరిగిన కథల ఆధారంగా సినిమాలు చేయడం.. మరింతగా సక్సెస్ అయిందనే చెప్పాలి. మయూరి సినిమా విషయానికి వస్తే.. ప్రముఖ నర్తకి.. సుధాచంద్రన్ జీవితాన్ని తెరకెక్కించారు.
ప్రపంచ స్థాయిలో సంప్రదాయ నృత్యానికి పేరు తెచ్చిన తమిళియన్ సుధాచంద్రన్. అయితే, ఆమె ఒక ప్రమాదంలో తన కుడికాలును కోల్పోయారు. నిజానికి గాయకుడికి గళం ఎంతప్రధానమో.. నృత్యం చేసేవారికి చేతులు… కాళ్లు అంతే ప్రధానం. మరి సుధా చంద్రన్ ప్రమాదంలో కాలు పోగొట్టుకోవడంతో ఇక, ఆమె నృత్యం చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. సాధారణంగా ఎవరైనా అయితే.. ఇంట్లో కూర్చుంటారు.
కానీ.. సుధాచంద్రన్ మాత్రం జైపూర్ ఫుట్ పెట్టుకుని… 4 సంవత్సరాలు సాధన చేసి.. మళ్లీ నృత్యాన్ని ప్రారంభించారు. అచ్చం.. కాలు ఉన్నట్టుగానే ఆమె అభినయం.. అడుగులు ఉండేవి. ఆమె నృత్యం చూసిన వారు ఎక్కడా అసౌకర్యానికి గురయ్యేవారు కాదు. ఇలాంటి కథను రామోజీరావు తెరకెక్కించారు. తొలుత భానుప్రియను సుధాచంద్రన్ పాత్రకు ఎంచుకున్నారు. కానీ, ఎందుకో.. రామోజీమనసు ఒప్పుకోలేదు.
దీంతో నేరుగా సుధాచంద్రన్‌తో మాట్లాడి.. ఆమెనే హీరోయిన్‌గా పరిచయం చేశారు. ఈ సినిమాలో నర్తకి సుధాచంద్రనే నటించారు. నిజానికి ఈ సినిమా అనుకున్నప్పుడు బాగానే ఉందని అనుకున్నారు. కానీ, హీరోయిన్ విషయంలో రామోజీ తీసుకున్న నిర్ణయంతో బయ్యర్లు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఈ సినిమాను రామోజీ సొంతగానే కొన్ని జిల్లాల్లో విడుదల చేశారు. ఒక వారం.. రెండో వారం.. తర్వాత.. ఈ సినిమాకు జనం పోటెత్తారు. అంతే.. నిర్విఘ్నంగా.. 200 రోజులు పూర్తి చేసుకున్న రామోజీ సినిమాగా ఇది రికార్డు సృష్టించింది. తర్వాత.. దీనినే ఎలాంటి మార్పులూ చేయకుండా… 18 భాషల్లో అనువదించారు.