Newsపెద్ద ప్ర‌మాదంలో చిక్కుకున్న టాలీవుడ్‌... హీరోలు మార‌క‌పోతే సినిమాలు రావు...!

పెద్ద ప్ర‌మాదంలో చిక్కుకున్న టాలీవుడ్‌… హీరోలు మార‌క‌పోతే సినిమాలు రావు…!

కరోనా తర్వాత ఓటీటీలకు ప్రజలు బాగా అలవాటు పడ్డారు. ఒక్క భాషా సినిమాలనే కాకుండా అన్ని భాషల సినిమాలను చూడటం కూడా ప్రారంభించారు. ఈ క్రమంలో స్టార్ హీరోల సినిమాలు పలు భాషల్లో రిలీజ్ అవుతూ పాన్ ఇండియా లెవెల్‌లో హిట్స్ సాధిస్తున్నాయి. సినిమాలకు బాక్సాఫీస్ కలెక్షన్లు కూడా ఎక్కువగానే వస్తున్నాయి. దీంతో తెలుగు సినిమా హీరోలు కరోనా తర్వాత తమ రెమ్యునరేషన్లను అమాంతం పెంచేశారు.

ఓటీటీల ద్వారా కూడా ఎక్కువగా సినిమాలకు డబ్బులు వస్తున్నాయి. దాంతో హీరోలు పారితోషికాలను చాలా శాతం పెంచేశారు. ఒకప్పుడు రూ.4 కోట్లకే సినిమాలు చేసిన హీరోలు ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.13 కోట్ల వరకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక కరోనాకు ముందు రూ.10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న హీరోలు ఇప్పుడు రూ.20 కోట్లకి పైగానే అడుగుతున్నారు. టాప్ హీరోల శాలరీ కూడా బాగా పెరిగింది.

ఇప్పుడు వారు ఒక్కో సినిమాకే రూ.75 కోట్ల నుంచి రూ.100 కోట్లు అడుగుతున్నారు. నిర్మాతలు కూడా అడిగినంత ఇచ్చేస్తున్నారు. అయితే ఇకపై ఆ పరిస్థితి ఉండబోతుందని తెలుస్తోంది. దీనికి కారణం ఎక్కువ ధరకు అమ్ముడుపోయే హిందీ డిజిటల్ రైట్స్‌ను ఇప్పుడు కొనడానికి ఏ ఓటీటీ సంస్థ కూడా ముందుకు రావడం లేదట. హిందీ డిజిటల్ రైట్స్ కొంటామని ఇంతకుముందు చెప్పిన సంస్థలే ఇప్పుడు వాటిని కొనలేమని మెయిల్స్ పెడుతున్నాయట.

నిజానికి హిందీ శాటిలైట్, డిజిటల్ రైట్స్ వల్ల టాలీవుడ్ నిర్మాతలకు భారీగా డబ్బులు వచ్చేవి. సినిమా మొదలైన కొద్ది రోజులకే నిర్మాతలకు ఈ డబ్బు దక్కెది. దీంతో మన హీరోలు నిర్మాతల ముక్కు పిండి ఎక్కువ శాలరీలు లాగేసేవారు. చాలామంది హీరోలకు ఈ హిందీ రైట్స్‌ బాగా కలిసొచ్చేవి. ఒక హీరో అయితే ఈ హిందీ హక్కులని చూపించి నిర్మాతనుంచి ఎక్స్‌ట్రాగా రూ.9 కోట్లు దండుకున్నాడట.

కెరీర్‌లో పెద్దగా హిట్స్ లేని మరో మాస్ హీరో కూడా వీటి దయ వల్లే ఇప్పటికీ సినిమాలు చేయగలుగుతున్నాడని కూడా తెలిసింది. కానీ హిందీ డిజిటల్ హక్కులను ఇప్పుడు కొనుగోలు చేసే సంస్థలు మొహం చాటేసాయి. దీంతో వ్యక్తిగతంగా ఆ హక్కులను కొనే వారికి నిర్మాతలు తెగ ఫోన్లు చేసేస్తున్నారు కానీ వారి నుంచి కూడా సరైన స్పందన రావడం లేదు.

మరోవైపు శాటిలైట్ హక్కులు కూడా దారుణంగా తగ్గాయి. ఆ విధంగా నాన్‌-థియేటర్ బిజినెస్ బాగా దెబ్బతింటోంది. ఇటీవల నాని నటించిన ఒక సినిమా హిందీ డిజిటల్ హక్కులు సేల్ కాలేదు. ఆ హక్కులు అవసరం లేదని ఓటీటీ సంస్థ కరాకండీగా చెబుతోందట. తెలుగు సీనియర్ హీరో నటించిన మరో సినిమా పరిస్థితి కూడా ఇలానే తయారయ్యింది. మొత్తం మీద టాలీవుడ్ ఇండస్ట్రీకి ప్రమాద హెచ్చరికలు వెళ్లిపోతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితులలో హీరోలు తమ రెమ్యునరేషన్ తగ్గించుకుంటారా లేదా అనేది చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news