మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో తన కెరీర్ లోనే కమర్షియల్ గా మంచి విజయం నమోదు చేశారు. నిజం చెప్పాలంటే రీఎంట్రీ తర్వాత చిరంజీవికి వీరయ్య సినిమాతోనే అసలు సిసలు విజయం దక్కింది. ఖైదీ నెంబర్ 150 సినిమా హిట్ అయినా అది తమిళంలో వచ్చిన కత్తి సినిమాకు రీమేక్. అందుకే ఆ సినిమాకు వసూళ్లు వచ్చినా పేరు రాలేదు.
ఆ తర్వాత వరుసగా సైరా – ఆచార్య – గాడ్ ఫాదర్ సినిమాలు డిజాస్టర్లు అవడంతో మెగా అభిమానులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. అయితే వీరయ్య విజయంతో వచ్చిన ఆనందం ఎక్కువ రోజులు నిలువలేదు. తాజాగా వచ్చిన భోళాశంకర్ అతిపెద్ద డిజాస్టర్ అయింది. ఇక భోళాశంకర్ సినిమాపై మెగా అభిమానులు తీవ్ర నిరాశ చెందడంతో పాటు విపరీతమైన ట్రోలింగ్ చేస్తున్నారు. చిరంజీవితో పాటు డైరెక్టర్ మెహర్ రమేష్ ను ఓ ఆటాడుకుంటున్నారు.
ఈ క్రమంలోనే చిరంజీవి తర్వాత సినిమా ఏ డైరెక్టర్ తో అన్న చర్చి నడుస్తోంది. ఈనెల 22న చిరు పుట్టినరోజు. ప్రస్తుతం చిరు మోకాలికి చిన్నపాటి ఆపరేషన్ జరగడంతో ఆయన విశ్రాంతిలో ఉన్నారు. అయితే కచ్చితంగా పుట్టినరోజున చిరు కొత్త సినిమా ఓపెనింగ్ ఉంటుందని తెలుస్తోంది. మరి చిరు కొత్త సినిమా ఏ డైరెక్టర్ తో ఉంటుందన్నది ఇప్పటికీ అయితే క్లారిటీ లేదు. రేసులో నలుగురు డైరెక్టర్లు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో బింబిసారా డైరెక్టర్ వశిష్టతో చిరు ఓ సినిమా చేయబోతున్నట్టు ప్రచారం ఉంది. అలాగే మెగా డాటర్ సుష్మిత కొణిదెల నిర్మించే సినిమాకు బంగార్రాజు డైరెక్టర్ కళ్యాణ కృష్ణ దర్శకత్వం వహించనున్నారు. ఈ ఇద్దరు డైరెక్టర్లతోపాటు డిజాస్టర్లతో రేసులో వెనుకబడిపోయిన ఏఆర్ మురుగదాస్ – వివి వినాయక్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వినాయక్ మురుగుదాస్‌తో మాత్రం సినిమా వద్దే వద్దు అంటూ మెగా అభిమానులు దండాలు పెడుతున్నారు. వినాయక్ ఎప్పుడో అవుట్ డేటెడ్ అయిపోయాడని.. అలాంటి డైరెక్టర్ తో మళ్లీ నాసిరకం సినిమా వద్దని చిరును వేడుకుంటున్నారు.