సాధారణంగా ఇతర భాషా సినిమాలను తెలుగులోకి అనువదించడమో.. లేక.. ఇతర కథలను కొనుగోలు చేయడమో మన దగ్గర ఎక్కువగా జరుగుతుంది. గతంలోనూ రాము, పాపం పసివాడు వంటి హిట్ సినిమా లను హిందీ రేమేక్‌గానే తీసుకువచ్చారు. అయితే.. వాటికి కొంత తెలుగు నేటివిటీ పెంచి.. తెలుగు ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా దర్శకులు జాగ్రత్తలు తీసుకున్నారు
అయితే.. దీనిని ఒకరిద్దరు దర్శకులు.. అదేవిధంగా అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్‌లు ఇష్టపడే వారు కాదు. పరాయి భాషా సినిమాల్లో ఏం నటిస్తాం.. అని మిన్నకుండే వారు. అయితే..దర్శకులు కథలో మార్పులు చేసి.. వీరిని ఒప్పించిన పరిస్థితి ఉంది. ఇక, ఇదే సమయంలో దర్శకుడు పుల్లయ్య. ఎల్ వీప్రసాద్ వంటివారు.. మన సినిమాలను ఇతర భాషా సినిమాల వారు కొనుగోలు చేసేలా తీర్చిదిద్దాలని భావించారు.
ఈ క్రమంలోనే ఎన్టీఆర్, అక్కినేని వంటివారు.. వారికి సహకరించారు. ఇలా.. పుల్లయ్య, ఎల్ వీ ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన పలు సినిమాలు హిందీలోకి రీమేక్ అయ్యాయి. వీటిలో ఎవరు హీరోలు అనే విషయాన్ని పక్కన పెడితే.. తెలుగులో తీసిన సినిమాలను హిందీలో రీమేక్ చేయడమే వారికి కావాల్సింది అన్నట్టుగా ఉండేది.
ఇలా.. శ్రీవేంకటేశ్వర మహత్యం.. దీనికి ముందు దేవదాసు, మిస్సమ్మ, శ్రీకృష్ణ తులాభారం వంటివి హిందీ సహా పలు భాషల్లో డబ్ అయి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇలా తెలుగు సినిమాలకు హిందీ మార్కెట్ కల్పించిన ఘటన వీరికే దక్కింది. మన హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా, నార్త్ మార్కెట్ అంటూ అడుగులు వేస్తున్నా ఎప్పుడో ఐదారు దశాబ్దాల క్రితమే మన సినిమాలకు పాన్ ఇండియా.. ముఖ్యంగా నార్త్ మార్కెట్ కల్పించిన ఘనత ఎన్టీఆర్, ఏఎన్నార్‌కే దక్కుతుంది.