యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న సలార్ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో చెప్పక్కర్లేదు. అసలు సలార్ 1 రిలీజ్‌కు కేవలం మరో 40 రోజుల టైం మాత్రమే ఉంది. అసలు కేజీయఫ్ 2 సినిమాకు ఇదే నిర్మాతలు ఎంత హడావిడి చేశారో చెప్పక్కర్లేదు. కేజీయఫ్ 2 ట్రైలర్ రిలీజ్ చేసేందుకు నేషనల్ మీడియాకు ప్రత్యేకంగా విమానం వేసి మరీ బెంగళూరుకు తరలించారు.
సలార్ విషయంలో మాత్రం అంతా సెలైన్స్‌గా ఉంది. టీజర్ సైలెంట్‌గా ఆన్‌లైన్‌లో వదిలారు. ఇక సలార్ 1 రన్ టైం కూడా కట్ చేసి ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. సినిమా ఫైనల్ రన్ టైం 200 నిమిషాలుగా ఉందని మహా అయితే ఓ 5-10 నిమిషాలు మాత్రమే కట్ చేస్తారని అంటున్నారు. ఇక సినిమాలో హీరో, హీరోయిన్ల మధ్య పాటలు, డ్యూయెట్లు ఉండవంటున్నారు.
ఇక తల్లి మీద సాంగ్ బాగుంటుందని… మిగిలిన రెండు మూడు పాటలు బ్యాక్‌గ్రౌండ్‌లోనే వెళ్లిపోతాయని తెలుస్తోంది. ఇంత ప్రతిష్టాత్మక సినిమాలో పాటలు లేకపోతే ఎలా ? అసలు ప్రభాస్ అభిమానులకే కాక.. ఇండియన్ సినీ జనాలకు ఈ సినిమా ఎలా ఎక్కుతుందన్న సందేహాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. అదే టైంలో సినిమాను హాలీవుడ్ రేంజ్‌లో ప్రశాంత్ నీల్ తీశాడని.. అందుకే పాటలకు పెద్దగా స్కోప్ లేకుండా కేవలం స్టోరీని యాక్షన్ బేస్‌లో నడిపించాడని తెలుస్తోంది.
పాటలు లేకపోవడంతోనే ఇప్పటి వరకు ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ చేయలేదంటున్నారు. ఇక సెప్టెంబర్ తొలి వారం నుంచి ప్రమోషన్లు స్టార్ట్ చేసి ఆ తర్వాత ట్రైలర్ రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.