సాధారణంగా సినీ రంగంలో ముందుగానే పారితోషికానికి సంబంధించిన సెటిల్మెంట్లు పూర్తి చేసుకుంటారు. ఎందుకంటే.. సినిమా విడుదలైన తర్వాత.. అవి ఆడకపోతే.. ఆ వంకతో పారితోషికం ఎక్కడ ఎగ్గొడతారో .. అనే బెంగ ఉంటుంది. అందుకే సినిమా షూ టింగ్ సమయంలోనే రెమ్యునరేషన్ విషయాన్ని పక్కాగా మాట్లాడుకుని తీసేసుకుంటారు. ఈ విషయంలో భానుమతి, అంజలీ దేవి వంటివారు పక్కాగా వ్యవహరించేవారు.
అయితే.. సావిత్రి మాత్రం చాలా మొహమాట పడేవారు. ఇచ్చింది తీసుకునేవారు. అడ్వాన్సుగా కొంత ఇవ్వమని మాత్రం అడిగేవారు.మిగిలిన సొమ్మును ఆమె పెద్దగా లెక్కపెట్టుకునేవారు కాదు. దీంతో చాలా మంది నిర్మాతలు సావిత్రికి బకాయిలు పడిన విషయం తెలిసిందే. ఇలానే అన్నగారితో కలిసి నటించిన సినిమాల్లోనూ సావిత్రి రెమ్యునరేషన్ గురించి పెద్దగా పట్టుబట్టేవారు కాదు. ముందుగా కొంత అడ్వాన్స్ తీసుకుని.. సినిమా అయిపోయిన తర్వాత మాత్రం ఒక్కసారి ఫోన్‌లో అడిగేవారట.
ఎంత ఇస్తే తీసుకునేవారు లేకపోతే.. తర్వాత చూసుకుందామని సరిపెట్టుకునేవారట. ఇలా వెంకటేశ్వర మహత్యం సినిమా విషయంలో నూ సావిత్రి ఇలానే చేశారు. ఇందులో అన్నగారు శ్రీవారి పాత్ర పోషించారు. పద్మావతి దేవిగా సావిత్రి నటించారు. అయితే.. ఈ సినిమా హిట్ టాక్ వచ్చినా రాబడి మాత్రం రాలేదు. దీంతో నిర్మాత సావిత్రికి ఇచ్చిన లక్షా 50 వేల అడ్వాన్స్ తర్వాత.. ముఖం చాటేశారు. సినిమా 50 రోజులు మాత్రమే ఆడింది. ఓ సందర్భంలో అన్నగారికి ఈ విషయం తెలిసింది.
సావిత్రికి పూర్తిస్తాయిలో రెమ్యునరేషన్ 3 లక్షలు ఇవ్వలేదని తెలిసింది. వెంటనే అన్నగారు ఆగ్రహానికి గురయ్యారు. నిర్మాతకు ఫోన్ చేసి.. ఇదేం పద్దతి. మన కష్టాలు మనకుంటాయి. వారిని ఇలా ఇబ్బంది పెడతారా? అంటూ.. ప్రశ్నించారు. అంతేకాదు.. పది రోజుల్లోగా సావిత్రిసొమ్ము ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. నిర్మాతతో కలిసి మరీ సావిత్రి ఇంటికి వెళ్లి.. పద్మావతి గారూ మన్నించాలి. వడ్డీ ఇవ్వలేక పోయినా.. అసలు ఇస్తున్నాం
అని చలోక్తులు విసిరి మరీ అన్నగారు సొమ్మును అప్పగించారు. ఇదీ.. ఎన్టీఆర్ నిబద్దత.