మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ సినిమాకు టికెట్ రేటు అనుమతి ఇవ్వటంలో ఏపీ ప్రభుత్వం జాప్యం చేస్తుంది. సినిమా విడుదలకు మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో టికెట్ రేట్లను పెంచుకునేందుకు ఇప్పటివరకు ఆమోదం లభించలేదు. అనుమతి ఇవ్వాలంటూ సినిమా యూనిట్ ఇప్పటికే దరఖాస్తు చేసుకుంది. అయితే దరఖాస్తులో సరైన వివరాలు పొందుపరచలేదని మరిన్ని వివరాలు కావాలని ప్రభుత్వం కోరుతుంది. దీంతో ప్రభుత్వం నుంచి అనుమతి రావటం పైన సినిమా యూనిట్ అనుమానం వ్యక్తం చేస్తుంది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఏపీ ప్రభుత్వం భోలాశంకర్ సినిమా టికెట్ల రేట్ల పెంపు దరఖాస్తు తిరస్కరించినట్టు తెలుస్తోంది. తాజాగా వాల్తేరు వీరయ్య 200 రోజులు ఫంక్షన్లో జగన్ సర్కార్ టార్గెట్ గా చిరంజీవి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు ఈ సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదన్న చర్చ సోషల్ మీడియాలో బలంగా జరుగుతుంది.
చిరంజీవి మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీపై పడి ఏడవటం తగదని.. సినిమా ఇండస్ట్రీ అనేది పిచ్చుకపై బ్రహ్మాస్త్రం లాంటిది అని ప్రభుత్వం ప్రత్యేక హోదా సాధించాలంటూ నేరుగానే జగన్ సర్కార్ను టార్గెట్ చేశారు. అయితే దీనిపై ఏపీ ప్రభుత్వం కూడా స్పందించింది. టిక్కెట్ రేట్లు పెంచుకోవడం కోసం చిత్ర బృందం దరఖాస్తు చేసుకుందని.. దరఖాస్తు తో పాటు ఇవ్వాల్సిన డాక్యుమెంట్లు ఇవ్వలేదని స్పష్టం చేసింది. మరిన్ని వివరాలు కావాలని సినిమా యూనిట్లు కోరామని తెలిపింది.
నిబంధనల ప్రకారం బడ్జెట్‌కు సంబంధించిన అన్ని పత్రాలు సమర్పిస్తే అనుమతులు లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. ఇక ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం రు. 100 కోట్ల బడ్జెట్ కు సంబంధించిన గైడ్లైన్స్ వివరాలు కావాలని కోరామని.. అవి తమకు సమర్పిస్తే పరిశీలించి అనుమతి ఇస్తామని స్పష్టం చేసింది. ఏది ఏమైనా భోళాశంకర్ సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం లేదని సంకేతాలు వస్తున్నాయి.