టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమా ఖలేజా. ఈ సినిమా ధియేటర్లలో సరిగా ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోయినా ఇప్పటికీ బుల్లితెర మీద వస్తుంటే ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోయి మరీ చూస్తూ ఉంటారు. ఇప్పుడు వచ్చినా టీవీల్లో టీఆర్పీల పరంగా దుమ్ము రేపుతూ ఉంటుంది. ఖలేజాలో కామెడీ త్రివిక్రమ్ డైలాగులు, పాటలు.. సెకండాఫ్ లో వచ్చే ఎమోషన్ సీన్లు ఎంతో బాగుంటాయి.
ఒక రొమాంటిక్ హీరోని దేవుడు అంటే జనాలు ఒప్పుకోకపోవడంతోనే ఈ సినిమా ప్లాప్ అయింది. అయితే ఖలేజా సినిమా టైటిల్ విషయంలో చాలా పెద్ద హైడ్రామా జరిగింది. అప్పట్లో ఇది పెద్ద హాట్ టాపిక్. ఎప్పుడో 13 సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటన ఈ తరం సినీ అభిమానులకు పెద్దగా తెలియకపోవచ్చు. ముందుగా త్రివిక్రమ్ ఖలేజా అనే పేరు పెట్టుకుని షూటింగ్ ప్రారంభించారు. జనాల్లోకి కూడా అదే టైటిల్ తో సినిమా తీసుకువెళ్లారు.
అయితే సినిమా రిలీజ్ నాలుగు రోజులకు ముందు విజయ భాస్కర్ రెడ్డి అనే ఒక నిర్మాత ఈ సినిమా టైటిల్ నాది.. నేను ఇదివరకే ఈ పేరు రిజిస్టర్ చేయించానని కోర్టుకు ఎక్కారు. వాస్తవానికి సదరు నిర్మాత నిజంగానే ఆ టైటిల్ రిజిస్టర్ చేయించుకున్నారు. అయితే ఖలేజా పేరుతో ఎలాంటి సినిమా తీయలేదు.. ఈ విషయం తెలియక త్రివిక్రమ్ ఖలేజా టైటిల్ తన సినిమాకు పెట్టుకొన్నారు. ఈ కేసు కోర్టులో వాదనకు వచ్చింది. విజయభాస్కర్ రెడ్డి ఖలేజా టైటిల్ రిజిస్టర్ చేయించుకున్న విషయం వాస్తవం కావడంతో సినిమా యూనిట్ రు. 10 లక్షలు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పింది.
దానికి విజయభాస్కర్ రెడ్డి కూడా ఓకే అన్నారు. అయితే జడ్జి కూడా విజయభాస్కర్ రెడ్డికి ఫేవర్‌గా తీర్పు ఇవ్వాలని అనుకున్నారు. వెంటనే అతడు మాట మార్చి రు. 25 లక్షలు కావాలని డిమాండ్ చేయడంతో జడ్జి సైతం షాక్ అయ్యారని ప్రచారం జరిగింది. రెండు రోజుల్లో సినిమా విడుదల ఉండగా ఇంత అత్యాశకు పోవడం కరెక్ట్ కాదని భావించి.. ఆధారాలను పరిశీలించడానికి టైం కావాలని ఇప్పుడు సినిమా రిలీజ్ ఆపటం కుదరదు అని కేసును డిస్మిస్ చేశారు.
అలా ఖలేజా టైటిల్ విషయంలో అప్పట్లో అంత రాద్ధాంతం జరిగింది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఖలేజా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇక తన టైటిల్ విషయంలో అత్యాశకు పోయినందుకు సదరు నిర్మాతకు ఒక్క రూపాయి కూడా రాలేదని పైగా కోర్టు ఖర్చులు కూడా అదనంగా చేతి చమురు వదిలేయని అంటారు.