టైటిల్: భోళాశంకర్
బ్యానర్: ఏకే ఎంటర్టైన్‌మెంట్స్
నటీనటులు: చిరంజీవి, తమన్నా, కీర్తిసురేష్, సుశాంత్, రఘుబాబు, మురళీశర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, శ్రీముఖి, రష్మి గౌతమ్ తదితరులు
యాక్షన్: రామ్ – లక్ష్మణ్
ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్
సినిమాటోగ్రఫీ: డూడ్లి
మ్యూజిక్: మహతి సాగర్
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
దర్శకుడు: మెహర్ రమేష్
రిలీజ్ డేట్: ఆగస్టు 11, 2023
సెన్సార్ రిపోర్ట్: యూ / ఏ
రన్ టైం: 160 నిమిషాలు
భోళాశంకర్ పరిచయం:
రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. గతేడాది ఆచార్య, గాడ్‌ఫాదర్, ఈ యేడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య.. ఇక ఇప్పుడు భోళాశంకర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే భోళాశంకర్ సినిమాపై మరి అంత హైప్ లేదు. దీనికి కారణం ఎప్పుడో ఆరేడేళ్ల క్రితం తమిళంలో అజిత్ హీరోగా వచ్చిన వేదాళం అనే ఊరమాస్ సినిమాకు రీమేక్‌గా ఇది తెరకెక్కింది. పైగా అరివీర భయంకర డిజాస్టర్లు ఇచ్చిన మెహర్ రమేష్ దర్శకుడు. అయినా మాస్ ఎలిమెంట్స్ ఏమైనా క్లిక్ అవుతాయేమో అన్న ఆశలతో పాటు మెహర్ స్టైలీష్ టేకింగ్ ప్రేక్షకులకు ఎక్కడైనా కనెక్ట్ అవుతుందా ? అన్న ఆశలు కూడా ఉన్నాయి. మరి ఇలా ఆశ, నిరాశల నేపథ్యంలో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో TL సమీక్షలో చూద్దాం.
TL స్టోరీ :
హైదరాబాద్‌లో గల్లీ సెటిల్‌మెంట్లు చేసుకునే శంకర్ ( చిరంజీవి) తన చెల్లి మహాలక్ష్మి కీర్తి సురేష్‌ను తీసుకుని కలకత్తా కాలేజ్‌లో ఆర్ట్స్ కోర్సులో చేర్పించేందుకు అక్కడకు వెళతారు. అక్కడ
అక్కడ వరుసగా అమ్మాయిల కిడ్నాప్‌లు జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే అక్కడ లాయర్ లాస్య ( తమన్నా ) కోసం ఓ అబద్ధపు సాక్ష్యం చెప్పబోయి ఆమెకే టార్గెట్ అవుతాడు. ఈ క్రమంలోనే మహాలక్ష్మిని లాస్య అన్న శేఖర్ ( సుశాంత్ ) ప్రేమిస్తాడు. ఈ క్రమంలోనే శంకర్ విలన్లను ఊచకోత కోసి చంపేస్తుండగా లాస్య చూసి షాక్ అవుతుంది. దీంతో శంకర్ లాస్యకు తనతో పాటు మహాలక్ష్మి గతం చెపుతాడు. అసలు మహాలక్ష్మి ఎవరు ? ఆమెకు శంకర్‌కు ఉన్న సంబంధం ఏంటి ? ఆ అమ్మాయిల కిడ్నాప్ ముఠా వెనక ఉన్న సూత్రధారి ఎవరు ? దీనిని శంకర్ ఎలా చేధించాడు ? ఈ కథ చివరకు ఏమైంది ? అన్నదే ఈ సినిమా స్టోరీ.
TL విశ్లేషణ :
సినిమా స్టార్ట్ అయ్యాక 30 నిమిషాల వరకు అస్సలు ఒక్క ఆసక్తి ఉన్న సీన్‌కూడా లేదంటే మెహర్ రమేష్ డైరెక్షన్ ఎలా స్టార్ట్ అయ్యిందో అర్థమవుతుంది. ఇక కథే 1970ల నాటి కాలంలో ఉంది అనుకుంటే.. మెహర్ రమేష్ డైరెక్షన్ 1980 కాలంలో ఉంది. అసలు డైలాగుల్లో కూడా ఏ మాత్రం పంచ్‌లు లేవు. ఆసక్తిగా లేవు. సీన్లు కూడా పరమ రొటీన్‌గా ఉన్నాయి. అసలు తమన్నా ఫస్ట్ కోర్టు సీన్ కూడా చాలా పేలవంగా ఉంది. చిరంజీవి లాంటి పెద్ద స్టార్ హీరో ఛాన్స్ ఇచ్చాడంటే దానిని ఎంతో బాగా యూజ్ చేసుకోవచ్చు. కానీ మెహర్ రమేష్ పదేళ్ల తర్వాత ఛాన్స్ వచ్చినా కూడా ఏ మాత్రం యూజ్ చేసుకోలేదు.
అసలు సినిమాలో ఫ్లస్ పాయింట్ చూద్దామంటే ఊతద్దంలో పెట్టి వెతికినా కనిపించ లేదంటే కథ, కథనాలు, డైరెక్షన్ ఎంత ఘోరంగా ఉన్నాయో తెలుస్తోంది. ఏ సినిమాకు అయినా బెనిఫిట్ షోకు ఫ్యాన్స్ సినిమాలో ఇంట్రడక్షన్ సీనో లేదా ఫైటింగ్ సీన్లో వీడియోలు తీసి స్టేటస్‌లు పెట్టుకుంటారు. అంత మెస్మరేజ్ చేసేంత గొప్ప సీన్లు ఒకటి రెండు వెతుక్కునేందుకు కూడా ఫ్యాన్స్ కష్టపడ్డారు అంటే మెహర్ రమేష్ డిజాస్టర్ టేకింగ్ చెత్త చెత్త చెత్తగా ఉందని అర్థమవుతోంది.
ఇక ఇంటర్వెల్ సీన్ కూడా మెహర్ డిజాస్టర్ మూవీ షాడోను గుర్తు చేస్తుంది. షాడోలో వరుసగా విలన్లను చంపుకుంటూ పోతుంటాడు వెంకీ. విలన్‌కు ముందు ఓ విలన్‌ను చంపే క్రమంలో మెయిన్ విలన్ నుంచి ఫోన్ వస్తుంది… ఆ ఫోన్ హీరో మాట్లాడతాడు. ఇక్కడ విలన్‌ను చంపేసి మెయిన్ విలన్‌తో నీ కోసం వెయిటింగ్ అని చెపుతాడు.. సేమ్ అదే సీన్ ఇక్కడ కూడా రిపీట్ చేసేశాడు. కాకపోతే ఇక్కడ విలన్లను చంపడం తమన్నా చూడడం ఒక్కటే యాడ్ చేశాడు.
అయితే సెకండాఫ్‌లో శ్రీముఖితో బొడ్డు సీన్‌తో పాటు అక్కడక్కడా కాస్త కామెడీ వర్కవుట్ అయినట్టుగా ఉంది. అదేమైనా క్లిక్ అయితే సినిమా మరీ తన్నేయకుండా కొంత వరకు నిలబడవచ్చు. క్లైమాక్స్ కూడా పరమ రొటీనే అయ్యింది. నటీనటుల్లో మెగాస్టార్ చిరంజీవి యాక్షన్ కంటే కూడా సెకండాఫ్‌లో చేసిన కామెడీ బాగా వర్కవుట్ అయ్యింది. చిరు ఏజ్ పైబడిన చాయలు స్పష్టంగా కనిపించినా డ్యూడ్లీ సినిమాటోగ్రఫీ మాయతో బాగానే మ్యానేజ్ చేశాడు. ఈ వయస్సులోనూ చిరు ఏజ్ తగ్గించి చూపించేందుకు బాగా శ్రమపడ్డారు. నటనా పరంగా చిరు నుంచి కొత్తగా ఆశించడానికేం లేదు. అంత గొప్ప కథ కాదు ఇది. ఇక హీరోయిన్ తమన్నా కొన్ని సీన్లు పాత్రలకు పరిమితమైంది. లాయర్ లాస్యగా ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లలో తళుక్కుమన్నా ఆమె అతి చేసినట్టుగా ఉంది. ఇక చిరు చెల్లి పాత్రలో కీర్తి సురేష్ పాత్రకు బాగానే ప్రాధాన్యం దక్కింది. ఇంకా చెప్పాలంటే తమన్నా కంటే కూడా కీర్తి సురేష్ పాత్ర ఫస్టాఫ్‌లోనూ.. సెకండాఫ్‌లోనూ చిరుతో కీర్తి పాత్ర ట్రావెల్ చేసింది.
ఇక కీర్తి సురేష్‌కు జోడీగా చేసిన సుశాంత్ పాత్రకు స్కోప్ లేదు. తెరనిండా చాలా మంది నటులు ఉన్నా ఎవ్వరికి ప్రాధాన్యత లేదు. సెకండాఫ్‌లో రష్మీ రెండు సీన్లు ఓ సాంగ్‌లో కాస్త హాట్‌గా మెరిసింది. హాట్ యాంకర్ శ్రీముఖి కీర్తి సురేష్ ఫ్రెండ్‌గా చిరును కవ్వించే పాత్రలో కనిపించింది. శ్రీముఖి – చిరు ఖుషి బొడ్డు సీను బాగా రిపీట్ చేశారు. ఇక తులసి, మురళీశర్మ, సురేఖవాణి, రఘుబాబు పాత్రలతో తెరమీద కనిపించారు. ఇక మెయిన్ విలన్‌గా చేసిన తరుణ్ అరోరా సెకండాఫ్ సగం అయ్యే వరకు కూడా పూర్తిగా ఎంటర్ కాలేదు. ఫస్టాఫ్‌లో ఫోన్ సీన్లకే పరిమితం. మెయిన్ విలన్ తరుణ్ అరోరా కంటే కొసరు విలన్లనకే కాస్త తెరమీద ప్రాధాన్యం దక్కింది.
టెక్నికల్‌గా ఎలా ఉందంటే…
ఇక టెక్నికల్‌గా డూడ్లీ సినిమాటోగ్రఫీ కలర్‌ఫుల్‌గా ఉంది. తమన్నా, కీర్తి సురేష్, శ్రీముఖి, చిరంజీవిని అందంగా చూపించేందుకు బాగా కష్టపడ్డారు. సినిమా అంతా క్లోజప్ షాట్‌లే కావడంతో కెమేరామెన్‌కు పెద్ద కష్టం కూడా లేదు. రామ్ లక్ష్మన్ ఫైట్లు పరమ రొటీన్‌గా ఉన్నాయి. ఏ మాత్రం కొత్తదనం లేదు. మార్తాండ్ కె. వెంకటేష్ పాత సీన్లను పేర్చేంందుకు పెద్దగా కష్టపడలేదు. ఎడిటర్‌కు పెద్ద పనిపెట్టలేదు దర్శకుడు. ఇక మణిశర్మ తనయుడు మహతి సాగర్ ఆల్బమ్ ఇప్పటికే తేలిపోయింది. పాటలు క్లిక్ కాలేదు. అయితే తమన్నా సాంగ్ మాత్రం తెరమీద బాగుంది. నేపథ్య సంగీతంలో మాత్రం అక్కడక్కడా మెరుపులు కనిపించాయి. అది కూడా సెకండాఫ్‌లోనే..! ఏదేమైనా సినిమాకు మ్యూజిక్ పెద్ద మైనస్. అనిల్ సుంకర, రామబ్రహ్మం నిర్మాణ విలువలు సినిమాకు తగినట్టుగా ఉన్నాయి. సినిమా మేకింగ్ ఖర్చు కంటే రెమ్యునరేషన్లే ఖచ్చితంగా ఎక్కువని క్లీయర్‌గా తెలిసిపోతోంది.
ఇక దర్శకుడు మెహర్ రమేష్ తమిళ వేదాళం మెయిన్ లైన్ తీసుకుని ఇక్కడ చిరు కమర్షియల్ మీటర్‌కు అనుగుణంగా మార్పులు అయితే చేశాడు. బట్ రాసిన రాత.. తీసిన తీత పాత చింతకాయపచ్చడి కన్నా మిన్నగా బూజుపట్టిపోయినట్టుగా ఉన్నాయి. 1970 – 1980ల నాటి కథ, కథనాలతో సినిమా తీసేశాడు. అసలు ఫస్టాఫ్ అయితే చాలా బోరింగ్ అనిపిస్తుంది. అసలు సినిమా కాస్త అయినా చూడాలి అనుకున్నాం అంటే అది కేవలం సెకండాఫ్ వల్లే… ఆ మాత్రం కూడా లేకపోతే సినిమా మరీ దారుణంగా ఉండేదే..! గట్టిగా నాలుగైదు సీన్లలో చిరు ఎలివేషన్లు తప్పా ఏం లేదు.
ఫ్లస్ పాయింట్స్ ( + ) :
- భూతద్దంలో పెట్టి చూస్తే సెకండాఫ్‌లో కొన్ని సీన్లు
మైనస్ పాయింట్స్ ( – ) :
- టోటల్ మూవీ
- వరస్ట్ డైరెక్షన్
- ఫస్టాఫ్
- పరమ చెత్త స్క్రీన్ ప్లే
- ఇరిటేటింగ్ సీన్లు
ఫైనల్‌గా…
భోళాశంకర్ ఓ రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్. ఇలాంటి సినిమాలు గత 20 – 30 ఏళ్ల నుంచే తెలుగులో ఎన్నోసార్లు చూసేశాం. తన చెల్లికి జరిగిన అన్యాయంపై రివేంజ్ తీర్చుకునే స్టోరీలు మనకు కొత్త కాదు. పోనీ అంతకు మించి ఈ సినిమాలో కొత్తదనం లేదు. కథే పాతది అనుకుంటే కథనం కూడా అలాగే ఉంది. ఇక వేదాళం సినిమాను ఇప్పటికే ఎన్నోసార్లు చూసేసిన మనవాళ్లకు సెకండాఫ్‌లో కొంత కామెడీ తప్పా అంతకు మించి చూడడానికేం లేదు. మెగా భక్తులు మాత్రమే ఓ సారి చూడొచ్చు.
భోళాశంకర్ ఫైనల్ పంచ్ : భోర్ శంకర్
భోళాశంకర్ TL రేటింగ్: 2 / 5