ఓ వర్గం ప్రేక్షకులకే పరిమితం కావడం అనేది చాలా చిన్న విషయంగా భావించే సినీ రంగంలో .. హీరోలు, హీరోయిన్లు.. మెజారిటీ ప్రేక్షకులకు చేరువ అవ్వాలని కోరుకుంటారు. అభిమానులు ఎంత ఎక్కువ మంది ఉంటే.. అంతగా సినిమాలు ఎక్కువ రోజులు ఆడతాయనే టాక్ అప్పుడు.. ఇప్పుడు కూడా ఉంది. అందుకే ఎక్కువ మంది అభిమానులు, ఫాలోయింగ్ ఉన్న నటులకు డిమాండ్ ఎక్కువ. రెమ్యునరేషన్ కూడా ఎక్కువే.
సినిమా తీసే నిర్మాతలు, సినిమా ప్రొడక్షన్ కంపెనీలు కూడా హీరోలు, హీరోయిన్లకు ఉన్న అభిమానుల సంఖ్యలను వారి అభిరుచులను కూడా దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేసిన సందర్భాలు అనేకం ఉ న్నాయి. అందుకే.. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటివారు తమ అభిమానులను పెంచుకునే ప్రయత్నాలు చేశారు. అవకాశం వచ్చినప్పుడల్లా పబ్లిక్ సమస్యలను భుజాన వేసుకునేవారు. వారితో మమేకం అయ్యారు.
అయితే భానుమతి మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరించేవారు. అభిమానులు అంటే.. ఆమెకు ఎక్కడా లేని కోపం వచ్చేది. అందరూ అభిమానులే అనేవారు. అంతేకాదు, ఒకానొక సందర్భంలో నాకు నేనే అభిమానిని అని చెప్పుకొన్నారు. దీంతో ఆమెకు ప్రత్యేకంగా అభిమాన సంఘాలు లేకుండా పోయాయి. ఆమె కూడా ఎంకరేజ్ చేసేవారు కాదు.
కేవలం ఆమెకు మహిళా అభిమానుల్లో ఓ వర్గం వారు మాత్రమే మిగిలారు. దీంతో భానుమతి సినిమాలకు నిర్మాతలు ఎక్కువగా క్యూ కట్టేవారు కాదు. అలా ఆమె కెరీర్ సావిత్రి అంత స్టార్‌డమ్‌లోకి రాకపోవడానికి ఆమె ప్రవర్తనే కొంత వరకు కారణమైంది. ఆ తర్వాత ఆమె సొంత బ్యానర్‌పైనే ఆమె సినిమాలు తీసుకునేవారు. అయితే.. అవి కూడా హిట్ కొట్టాయి.