తెలుగు తీసిన బాల భారతం సినిమాలో దాదాపు 150 మంది చిన్న పిల్లలను తొలిసారి తెరమీద పరిచయం చేశారు. ఇది కమలాకర కామేశ్వరరావు చేసిన పెద్ద ప్రయోగంగా అప్పట్లో చెప్పుకొనేవారు. దీనిలో శ్రీదేవి అద్భుతమైన పాత్రలో నటించింది. తెలుగు వారితో పాటు.. కొందరు తమిళియన్, కన్నడియన్ నుంచి కూడా పిల్లలను తీసుకుని పరిచయం చేశారు. అయితే.. ఈ సినిమా తెలుగులో సూపర్ హిట్ కావడంతో అనేక భాషల్లోనూ డబ్ చేసుకున్నారు.
ఆఖరికి బాల భారత్ పేరుతో హిందీలోనూ ఈ సినిమాను డబ్బింగ్ చేసుకున్నారు.. ఇదిలావుంటే.. అసలు ఈ సినిమా తీయడానికి ముందు ఎవరూ సాహసం చేయలేదు. అందరికీ అనుమానం. అందరికీ తెలిసిన కథ కావడం.. పైగా పేరులోనే బాల అని ఉండడంతో చిన్నపిల్లల సినిమా ఎవరు చూస్తారని అందరూ సందేహాలు వ్యక్తం చేశారు. అయినా..కూడా కామేశ్వరరావు పట్టుబట్టి సినిమా చేశారు. చివరకు ఈ సినిమా తెలుగులో నాలుగుసార్లు రిలీజ్ అయి విజయవంతంగా సాగింది.
అయితే.. పౌరాణిక సినిమాలకు ఎంతో మొగ్గు చూపించే అన్నగారు ఎన్టీఆర్ దీనిని ముందుగానే తీయాల ని అనుకున్నారు. కానీ, ఆయన కూడా చిన్నపిల్లల సినిమా అని తీసేందుకు ముందుకు రాలేదు. ఇది హిట్ కాకపోతే ఇబ్బంది అని ఆయన సోదరుడు త్రివిక్రమరావు చెప్పడంతో వెనుకడుగు వేశారు అయితే.. కామేశ్వరరావు చేసిన ప్రయోగం హిట్ కొట్టడంతో అన్నగారు.. ఆశ్చర్యపోయారు. తర్వాత.. వరుస పెట్టి కామేశ్వరరావుతో ఆయన రెండు సినిమాలు చేయడం విశేషం.