ఎలిజిబెత్ -2 అంటే.. బ్రిటన్ సహా బ్రిటీష్ సామ్రాజ్యాన్ని కొన్ని దశాబ్దాల పాటు ఏలిన మహారాణి. అలాం టి ఎలిజిబెత్ – 2 అన్నగారు ఎన్టీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారంటే ఆశ్చర్యం వేస్తుంది. దీనికి కారణం.. అన్నగారు ఎన్టీఆర్ తొలి ప్రభుత్వంలోనే పేదలకు రూ.2కే కిలో బియ్యాన్ని పంపిణీ చేయడం. ఈ విషయం.. ఊరూ వాడా ఆయనకు మంచి పేరుతెచ్చింది. అదేసమయంలో ప్రపంచ పత్రికలు కూడా కొనియాడాయి.
ఈ విషయం తెలుసుకున్న బ్రిటన్ రాణి ఎలిజిబెత్ 1983 నవంబరులో హైదరాబాద్ వచ్చినప్పుడు బొల్లారంలో హోలీ ట్రినిటీ చర్చిని సందర్శించారు. అక్కడ ఆమెకు స్వాగతం పలికేందుకు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వచ్చారు. ఆయనను చూడగానే ఆమె… ‘ రైస్ బౌల్ ఆఫ్ పూర్ మ్యాన్’ అని పలకరించారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని తెలుసుకున్నానని ఆమె చెప్పారు. చాలా గొప్ప పథకమని ఆమె చెప్పుకొచ్చారు.
1983 జనవరిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎన్టీఆర్ రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని రాష్ట్రంలో అమల్లోకి తీసుకొచ్చారు. దీంతో పాటు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించిన ఎన్టీఆర్.. ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేశారు. పేదలకు కూడూ గూడూ గుడ్డా కల్పించాలన్న నినాదానికి ప్రతీకగా నిలిచారు. సంక్షేమ కార్యక్రమాలకు బలమైన పునాది వేశారు.
తమ పార్టీ జెండాలో కూడా పేదవాడిని ప్రతిబింబించేలా గుడిసెను పెట్టారు. ఎన్టీ రామారావు సీఎం అయిన సమయంలో రాష్ట్ర బడ్జెట్ చాలా తక్కువ. గాలికి కొట్టుకుపోయే పూరి పాకల స్థానంలో పేదలకు పక్కా ఇళ్లు కట్టించడం మొదలు పెట్టారు. ప్రతి గ్రామంలోనూ రేషన్ దుకాణం ఏర్పాటుచేసి పేదలందరికీ కిలో బియ్యం రెండు రూపాయలకే అందించా రు. జనతా వస్త్రాల పథకం పేరుతో సగం ధరకే ధోవతి, చీరె సరఫరా చేశారు.
వితంతు మహిళలు, అసంఘటిత రంగ కార్మికులు 60 ఏళ్లు దాటిన వారికి పింఛను ఇచ్చే పథకాన్ని ఎన్టీఆర్ ప్రవేశపెట్టారు. అప్పటిదాకా పేదలకు పింఛను పథకాలు రాష్ట్రంలో లేవు. ఈ పథకం ద్వారా ఇచ్చే మొత్తం మొదట 60 రూపాయలతో ప్రారంభమై క్రమేణా పెరుగుతూ వచ్చింది. గురుకుల వ్యవస్థను అమల్లోకి తెచ్చారు. పాఠశాల, నివాస వసతిని ఒకేచోట ఏర్పాటు చేస్తూ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటయ్యాయి.