ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ చూసినా సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన విరూపాక్ష సినిమా గురించి చర్చ జరుగుతోంది. సాయి తేజ్ కు యాక్సిడెంట్ అయ్యాక కోలుకున్నాక చేసిన మొదటి సినిమా విరూపాక్ష. సుకుమార్ శిష్యుడు కార్తీక్ దర్శకుడుగా పరిచయం అవుతూ తెరకెక్కిన ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్లే అందించారు. సంయుక్తమీనన్ హీరోయిన్గా నటించిన విరూపాక్ష సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి తొలి రోజు నుంచి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.
విచిత్రం ఏంటంటే తొలిరోజు కంటే రెండో రోజు ఈ సినిమాకు అదిరిపోయే వసూళ్లకు వచ్చాయి. రెండు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రు. 28 కోట్ల గ్రాఫ్ వసూళ్లు కొల్లగొట్టింది. ఈ హర్రర్ సినిమాతో ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో థియేటర్లు మోత మోగిపోతున్నాయి. ప్రేక్షకులు ఎలాగైనా వీలు చూసుకుని ఈ సినిమా చూడాలన్న ఆత్రుతతో ఉన్నారు. ఈ క్రమంలోని చాలా చోట్ల టిక్కెట్లు కూడా దొరకని పరిస్థితి.
హైదరాబాద్ మూసాపేటలోని ఏసియన్ లక్ష్మి కళ థియేటర్లో సినిమా టికెట్లు కొనుగోలు చేసి సినిమా చూసేందుకు లోపలికి వెళ్ళిన ప్రేక్షకులకు నిరాశ ఎదురయింది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు లోపలికి వెళ్లిన ప్రేక్షకులు గంటకు పైగా షో కోసం ఎదురుచూశారు. ఎంతవరకు షో ప్రారంభం కాలేదు. గంటన్నర తర్వాత కూడా షో వేయకపోవడంతో ఆగ్రహానికి గురైన అభిమానులు థియేటర్లోని అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు.
విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితి అదుపులోకి తీసుకువచ్చారు. అటు థియేటర్ యజమానులు సైతం టికెట్లు కొనుగోలు చేసిన వారికి డబ్బులు తిరిగి ఇచ్చివేశారు. అయితే చాలామందికి జీఎస్టీ, పార్కింగ్ ఫీజు అంటూ సగం టికెట్ డబ్బులు ఇచ్చారని.. కొందరికి మాత్రమే పూర్తి మొత్తం డబ్బు వాపస్ చేశారంటూ ప్రేక్షకులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ఇక థియేటర్లో టెక్నికల్ సమస్యల వల్లే షో వేయటం కుదరలేదని తెలుస్తోంది. అయితే యాజమాన్యం ఈ విషయాన్ని ప్రేక్షకులతో ముందుగా చెప్పకపోవడంతో వారి ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది.