ఒక సినిమా తీయాలంటే.. ముందుగానే దర్శకుడు.. కొన్ని పాత్రలను ఊహించుకుంటారు. అదేవిధంగా నిర్మాత కూడా తన అంచనాలకు అనుగుణంగా.. దర్శకుడిని ఎంచుకుంటారు. అనంతరం.. సినిమాను సెట్స్‌మీదకు తీసుకువెళ్తారు. అయితే.. ఇలా అనుకునితక్కువ బడ్జెట్‌తో మంచి కథను అందించాలని అనుకున్న సినిమా.. సీతారామయ్యగారి మనవరాలు. ఈ సీనిమా సూపర్ హిట. పైగా అప్పుడప్పుడే ఎదుగుతున్న సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి బాణీల ప్రయోగం. వెరసి సినిమాను అద్భుతః అనిపించాయి.
కానీ, ఈ సినిమా అనుకున్న విధంగా అయితే.. ముందుకు సాగలేదు. కథ ఓకే అయిపోయింది. నిర్మాత దొరస్వామిరాజుకు, దర్శకుడు క్రాంతికుమార్‌కు మధ్య కెమిస్ట్రీ కూడా కుదిరిపోయింది. కానీ, అనుకున్నది అనుకున్నట్టు జరగలేదు. ఎందుకంటే.. ఇందులో అక్కినేని పాత్ర పక్కన కీలకమైన పాత్రను ముందుగా శారదను అనుకున్నారు. అదేవిధంగా మనవరాలిగా.. ముందు.. గౌతమిని అనుకున్నారు. వీరికి అడ్వాన్సులు కూడా ఇచ్చేశారు. కానీ, ఎందుకో.. ఇద్దరూ కూడా డుమ్మా కొట్టేశారు. కథలో బలం లేదనుకున్నారో..లేక ఎక్కదని అభిప్రాయపడ్డారో తెలియదు.
దీంతో షూటింగుకు సమయం కూడా నిర్ణయించుకున్నాక.. అనూహ్యంగా ఆరెండు పాత్రలను మార్చేయాల్సి వచ్చింది. దీంతో జోక్యం చేసుకున్న అక్కినేని నాగేశ్వరరావు.. ఆ రెండు పాత్రలు నాకు వదిలేయండి.. మీకు నచ్చిన వాళ్లను తెచ్చే బాధ్యత అని చెప్పారట. షూటింగ్ ప్రారంభించాల్సిన సమయం వచ్చేసింది. అక్కినేని కారులో వచ్చారు. కానీ, నిర్మాత, దర్శకులకు టెన్షన్. అక్కినేని ఏం చేస్తారో అని! కానీ, అక్కినేని కారు వెనకే.. మరో రెండు కార్లు ఆగాయి. ఆ రెండు కార్లలోంచి ఒకరు మీనా, మరొకరు రోహిణి హట్టంగడి (రాత్రి సినిమా ఫేమ్-కన్నడ) దిగారు. దీంతో క్రాంతి కుమార్, దొరస్వామి రాజు ఊపిరి పీల్చుకున్నారట.
అయితే..వీరు కథలో ఇమిడిపోతారా? అని వారు సందేహించారట. అయినా.. కూడా అక్కినేనిపై ధైర్యంతో వారు ముందుకు సాగారు. సినిమా విడుదలైంది. తొలి వారం కలెక్షన్లు లేవు. దీంతో దొరస్వామి రాజు ఎవరికీ చెప్పకుండా బెంగళూరు వెళ్లిపోయారట. కానీ, రెండో వారం నుంచి సినిమాకు జనాలు పోటెత్తారు. అంతేకాదు.. సూపర్ హిట్ టాక్ వచ్చేసింది. పైగా మీనా, రోహిణి పాత్రలకు మంచి పేరు కూడా వచ్చింది. దీంతో ఈ క్రెడిట్ అంతా అక్కినేనిదేనని చెప్పేవారు దొరస్వామిరాజు. కథకు తగిన విధంగా వీరిని ఎంపిక చేయడం పూర్తిగా అక్కినేని వల్లే సాధ్యమైందని అనేవారట.