తెలుగు సినీ రంగానికి దక్కిన అనేక మంది మహానటీమణుల్లో వాణిశ్రీ కూడా ఒకరు. వందలాది సినిమాల్లో నటించారు. అయితే.. సినీ ఇండస్ట్రీకి సాధారణంగానే వచ్చినా.. ఇక్కడ ఎక్కువగా భానుమతి, షావుకారు జానకి వంటివారితో ఆమె ఎక్కువగా చనువుగా ఉండేవారు. దీంతో వారిలో ఉన్న కొన్ని రిజర్వ్‌డ్ లక్షణాలు వాణిశ్రీకి కూడా వచ్చాయి. దీంతో వాణిశ్రీ అంటే రిజర్వ్‌డ్ గా ఉండే పేరును తెచ్చుకున్నారు. అంతేకాదు.. ఆదిలో ఆమె ఇండస్ట్రీకి హీరోయిన్ కావాలనే వచ్చారు.
కానీ, వచ్చిన వారంతా హీరోయిన్లు కాలేరు కదా..! ఇదే పరిస్థితి వాణిశ్రీకి కూడా ఎదురైంది. దీంతో దాదాపు పది పదిహేను సినిమాల వరకు కూడా చెల్లిగానో.. కూతురుగానో.. క్యారెక్టర్ పాత్రలే నటించారు. కొన్ని కొన్ని సినిమాల్లో కమెడియన్ పాత్రలు కూడా నటించారు. ఇవి బాగా హిట్టయ్యాయి. దీంతో వాణిశ్రీ అని ఎవరైనా అనగానే .. అందరూ కమెడియన్ వాణిశ్రీనా ? అని నిక్‌నేమ్ పెట్టేశారు.
ఇక, అప్పటి నుంచి ఆమెను కమెడియన్ వాణిశ్రీగానే పిలిచేవారు. ఎవరైనా ఇలా పిలిస్తే ఆమెకు సర్రున కోపం వచ్చేసేది. అయితే.. ఈ పరిస్థితి, కళాతపస్వి కే. విశ్వనాథ్ ఇచ్చిన అవకాశంతో వాణిశ్రీ హీరోయిన్ అయి..కమెడియన్ అనేపేరును తొలగించుకున్నారు. ‘నిండు హృదయాలు’ సినిమాను కే. విశ్వనాథ్ తీశారు. దీనిలో అన్నగారు ఎన్టీఆర్ హీరో. హీరోయిన్‌గా వాణిశ్రీ బుక్ అయిన మొదటి సినిమా.
అప్పట్లో హీరోయిన్‌గా తారాపథంలో ఉన్న కృష్ణకుమారి హఠాత్తుగా సినిమాలు మానుకోవడంతో, ఆ అదృష్టం వాణిశ్రీని వరించింది. అప్పటి దాకా కామెడీ పాత్రలు వేస్తున్న వాణిశ్రీని హీరోయిన్‌గా తీసుకున్నారు. వాణిశ్రీ కూడా ఈ అవకాశాన్ని బాగా సద్వినియోగం చేసుకుంది.
దుక్కిపాటి మధుసూదనరావు తీసిన ‘ఆత్మీయులు’ సినిమాలో హీరో చెల్లెలి పాత్ర వేయమంటే ‘‘లేదండీ! అవతల ఎన్.టి.ఆర్ గారికి నాయికగా వేస్తున్నాను. ఇక చెల్లి పాత్రలు వేయను’’ అని కరాఖండిగా చెప్పింది. ‘నిండు హృయాలు’లో వాణిశ్రీ, ఎన్.టి.ఆర్.ల కాంబినేషన్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక, ఆ తర్వాత శోభన్‌బాబు , కృష్ణలు చాలా అవకాశాలు ఇచ్చారు. శోభన్‌బాబు-వాణిశ్రీల గురించి ఇండస్ట్రీలో పెద్ద టాక్ కూడా నడిచింది.