నందమూరి నటసింహం బాలకృష్ణ – కోదండరామిరెడ్డి కాంబినేషన్ అంటేనే సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. కోడి రామకృష్ణ తర్వాత బాలయ్య కెరీర్ను ఒక రేంజ్ లో నిలబెట్టిన దర్శకుడు కచ్చితంగా కోదండరామిరెడ్డి అని చెప్పాలి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన యాక్షన్ సినిమాలు అప్పట్లో ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. అయితే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన భిన్నమైన కుటుంబ కథ చిత్రం నారీ నారీ నడుమ మురారి. 1990, ఏప్రిల్ 27న రిలీజ్ అయిన ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా శోభన – నిరోషా హీరోయిన్లుగా నటించారు.
నక్క బొక్కలపాడు అనే గ్రామంలో బాగా తలబిరుసు ఉన్న అత్త శేషారత్నంగా శారద, ఆమె భర్త జానకీరామయ్యగా సత్యనారాయణ నటించారు. వీరిద్దరి పిల్లలు శోభన – నిరోషా. తన మేనల్లుడు అయిన బాలకృష్ణకు తన ఇద్దరు కూతుర్లలో ఒకరిని ఇచ్చి పెళ్లి చేయాలని సత్యనారాయణ చూస్తూ ఉంటాడు. అయితే శారదకు భర్త వైపు బంధువులంటే అస్సలు ఇష్టం ఉండదు. అయితే మేనమామ కోరిక ప్రకారం నక్కబొక్కలపాడుకు వచ్చిన బాలయ్యను ఇద్దరు మరదళ్లు ప్రేమించడం మొదలు పెడతారు.
ఆ తర్వాత జరిగిన ఆసక్తికర పరిణామాలతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కేవీ మహదేవన్ సంగీతంలోని అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.
ఇరువురు భామల కౌగిలిలో – ఏం వాన తరుముతున్నది – మనసులోని మర్మమునుతెలుసుకో – పెళ్ళంటూనే వేడెక్కిందే గాలి – దుత్తలాగున్నావె రత్తమ్మత్తా – వయసు సొగసు కలిసిన వేళ అసలు ఈ పాటలు ఇప్పటకీ వింటుంటూనే హాయి గొలుపుతూ ఉంటాయి.
ఇక యువచిత్ర పతాకం పై నిర్మాత మురారి బాలకృష్ణ హీరోగా నిర్మించిన రెండో సినిమా నారీ నారీ నడుమ మురారి. ఈ బ్యానర్లో బాలయ్య హీరోగా వచ్చిన తొలి సినిమా సీతారామ కళ్యాణం. జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా కూడా సూపర్ హిట్. ఇక నారీనారీ నడుమ మురారి సినిమాకి వెంకటేశ్వర మహాత్యం సినిమా కొంత ఆధారంగా కనిపిస్తుంది. ఈ సినిమాలో హీరో పేరు కూడా వెంకటేశ్వర రావే కావటం విశేషం.
ఇక ఈ సినిమాలో ఓ సాంగ్‌తో పాటు ఓ సీన్‌లో పాత చిత్రం తాలూకూ క్లిప్పింగ్స్ కనిపిస్తాయి. సినిమా ఎంత పెద్ద హిట్ అయినా కామెడీ సపరేట్ ట్రాక్ చిట్టిబాబు, అనంత్, మమతలతో సరిగా పండలేదు. ఇక ఈ సినిమా షూటింగ్ తమిళనాడులోని వేలచ్చేరి ప్రాంతంలోని చిరంజీవి గెస్ట్ హౌస్ లో జరిగింది. అలాగే తమిళనాడులోని గోపిచెట్టిపాళయం వద్ద ఔట్ డౌర్ షూటింగ్ కూడా చేశారు. మరో విశేషం ఏంటంటే
నక్కబొక్కలపాడు అనే పేరు, దొంగరాముడు సినిమాలో అక్కినేని ఊరు పేరు కావడం విశేషం.