శోభన్‌బాబు.. అనగానే ఆరడుగుల అందగాడు. హీరోయిన్లనుచూసి మోహించే హీరోలు ఉండడం సహజం. అయితే.. హీరోను చూసి మోహించిన హీరోయిన్లు ఉన్నారంటే.. అది అప్పట్లో ఎన్టీఆర్, అక్కినేనిల తర్వాత.. శోభన్‌బాబుకే దక్కింది. అంతటి అందగాడు. సోగ్గాడుగా కీర్తి కొట్టేశాడు. తెలుగు చిత్రసీమలో అనేక మంది హీరోలు ఉన్నప్పటికీ.. ఎంతో మంది అందగాళ్లు ఉన్నప్పటికీ.. శోభన్ బాబుకు మాత్రమే సోగ్గాడు అనే పేరు దక్కింది. అయితే.. అంతటి అందగాడు కూడా తన అందానికి భిన్నమైన పాత్ర వస్తే.. కాదనకుండా నటించారు.
అదే.. చెల్లెలి కాపురం సినిమా. దీనిని కళాతపస్వి కే. విశ్వనాథ్ తీశారు. అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఓ ఇంట్రస్టింగ్ స్టోరీ కూడా జరిగిందని అంటారు. ఇక ఈ సినిమాలో నటించేందుకు . శోభన్‌బాబు ఒప్పుకోవడానికి కారణం.. నటుడు, నిర్మాత బాలయ్య ఆయనకు స్నేహితుడు. దీంతో అందాల నటుడిగా తనకున్న ఇమేజ్‌ను పక్కన పెట్టి డీ గ్లామరైజ్డ్ రోల్‌ను పోషించారాయన.
చెల్లెలి కాపురం కోసం రచయితగా తన కెరీర్‌ను త్యాగం చేయడానికి సిద్ధపడిన అన్నగా అద్భుతంగా నటించాడు శోభన్ బాబు. ఈ సినిమా కోసం శోభన్‌బాబు తీసుకున్న పారితోషకం 15 వేలు. అయితేనేం అంతకు మించిన నటనతో ఆయన ఆకట్టుకున్నారు. ఈ సినిమాతో ఉత్తమ నటుడిగా అవార్డుని సైతం శోభన్‌బాబు అందుకున్నారు. ఇక, కేరక్టర్ నటుడు బాలయ్య నిర్మాతగా మారి నిర్మించిన తొలి చిత్రం ఇదే.
ఓ పత్రికలో బాలయ్య రాసిన ‘నలుపు – తెలుపు’ కథ ఈ చిత్రానికి ఆధారం. మూలకథకు దర్శకుడు కె.విశ్వనాథ్ మరిన్ని మెరుగులు దిద్దారు. నాలుగున్నర లక్షల వ్యయంతో తయారైన ‘చెల్లెలి కాపురం’ 1971 డిసెంబర్ 27న విడుదలైంది. వాణిశ్రీ కథానాయికగా నటించారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు వాణిశ్రీ శోభన్‌బాబుపై నిజంగానే మనసు పారేసుకుందన్న గుసగుసలు అప్పట్లో వినిపించాయి.
అప్పట్లో ఈ వార్త పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. ఈ సినిమాలోని కొన్ని పాటలు ఇప్పటికీ అందరినీ అలరిస్తున్నాయంటే ఆ ఘనత సినిమా తీసిన విశ్వనాథ్‌తోపాటు..నటించిన శోభన్‌బాబుకే దక్కుతుంది. అన్నట్టు ఈ సినిమాలో శోభన్‌బాబు నల్లగా కురూపిగా ఉంటారు.