బాహుబలి లాంటి మెగా సక్సెస్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి ఎవరు ఊహించని కాంబినేషన్ సెట్ చేశాడు. టాలీవుడ్ లోనే భిన్నమైన వర్గాలకు హీరోలుగా ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో త్రిపుల్ ఆర్ లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా తెరకెక్కించారు. అసలు ఈ ఇద్దరు హీరోలను కలిపి మల్టీస్టారర్ సినిమా తీయటమే గొప్ప ఆలోచన.. అలాంటిది ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో పాటు ఏకంగా ప్రపంచ స్థాయిలో గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుని ఆస్కార్ అవార్డు కూడా సొంతం చేసుకుంది.
ఈ సినిమాలో నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో ఆస్కార్ అవార్డు సాధించిన సంగతి తెలిసిందే. ఇలాంటి గొప్ప సినిమా దానయ్య ప్రొడక్షన్లో తెరకెక్కించటం.. నిర్మాతగా ఆయనకు మంచి గౌరవం దక్కింది. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం దానయ్యకు ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం ఆ మాట నెరవేరుస్తూ రాజమౌళి ఇప్పుడు ఈ భారీ సినిమాను ఆయన బ్యానర్లో చేశారు. అయితే రాజమౌళి దానయ్య బ్యానర్లో ఈ సినిమా చేయటం వెనక ఓ ఆసక్తికరమైన స్టోరీ ఉంది.
సింహాద్రి తర్వాతే దానయ్య రాజమౌళికి తన బ్యానర్లో సినిమా చేసి పెట్టాలని అడ్వాన్స్ ఇచ్చారు. అయితే మగధీర మీరు చేస్తారా ? అని దానయ్యను రాజమౌళి అడిగారు. అప్పట్లో అంత భారీ బడ్జెట్ సినిమా అంటే దానయ్య కాస్త వెనక ముందు ఆలోచించారు. మగధీర కనీవిని ఎరుగని రీతిలో బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. ఆ వెంటనే దానయ్యకు రాజమౌళి పై గురి కుదిరింది. తర్వాత సునీల్ తో రాజమౌళి తెరకెక్కించిన మర్యాద రామన్న సినిమాను ఆయన బ్యానర్లో తీస్తానని చెప్పారు.
మగధీర తర్వాత రాజమౌళి టాలెంట్ ఏంటో ? చూసిన దానయ్య సునీల్ లాంటి హీరోతో ఆ చిన్న సినిమా తన బ్యానర్లో చేసేందుకు ఇష్టపడలేదు. రాజమౌళితో తీస్తే ఒక పెద్ద భారీ సినిమా తీయాలని కలలు కనడం మొదలుపెట్టారు. ఆ తర్వాత రాజమౌళి తనకు ఉన్న కమిట్మెంట్లు అన్ని పూర్తి చేసేసరికి మరో 10 ఏళ్లు పట్టింది. ఎంత లైట్ చేసినా.. లేటెస్ట్ గా అదిరిపోయే సినిమాను దానయ్యకు చేసి పెట్టారు రాజమౌళి.
ఒకవేళ సునీల్ సినిమాకు దానయ్య ఓకే చెప్పి ఉంటే త్రిబుల్ ఆర్ లాంటి సినిమా వచ్చేదే కాదు. ఆ తర్వాత దానయ్య తనకు పెద్ద సినిమా చేసి పెట్టమని అడగడంతో.. బాహుబలి తర్వాత వెంటనే రాజమౌళి మదిలో త్రిబుల్ ఆర్ కథ తట్టడం.. తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌తో చెప్పి ఆ లైన్ డెవలప్ చేయించుకోవడం.. టాలీవుడ్ లోనే ఇద్దరు స్టార్ హీరోలను కలిపి త్రిబుల్ ఆర్ సినిమాగా మల్టీస్టారర్ తెరకెక్కించటం చకాచకా జరిగిపోయాయి. ఏదేమైనా దానయ్య అప్పుడు మర్యాద రామన్న సినిమా చేసి ఉంటే.. ఇప్పుడు త్రిబుల్ ఆర్ సినిమా వచ్చి ఉండేదే కాదని చెప్పాలి. లేదా ఈ సినిమా మరో నిర్మాత ఖాతాలో చేరిపోయి ఉండేది. దానయ్య ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసినా ఆయన ఊహకే అందనంత గొప్ప సినిమా రాజమౌళి అందించాడు.