విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన అనేక సిని మాలకు దర్శకత్వం చేశారు. అనేక సినిమాలను కూడా నిర్మించారు. అయితే.. ఎప్పుడూ కూడా ఆయనదే పైచేయి. అయితే.. మహానటి భానుమతి విషయంలో మాత్రం ఎవరైనా తగ్గాల్సిందే. ఎందుకంటే హీరోతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఆమె ముఖ్యులు
అయితే.. ఒకటి రెండు సినిమాల్లో మాత్రం భానుమతి తాను పెట్టుకుని బారికేడ్స్‌ను తనే అధిగమించారు. ముఖ్యంగా ఎన్టీఆర్ దర్శకత్వం అంటే ఎంతో ఇష్టపడే భానుమతి.. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో నటించేందుకు రెమ్యునరేషన్ గురించి ఆలోచించేవారు కాదు. ఇలా.. ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తీసిన తాతమ్మ కల సినిమాలో భానుమతి నటించారు. దీనిలో తాతమ్మ పాత్రను భానుమతి వేశారు.
ఇక్కడ చిత్రం ఏంటంటే.. భానుమతి పాత్రకు మనవడిగా ఎన్టీఆర్ నటించాలి. అటువంటి పాత్ర పోషించడానికి భానుమతి అంగీకరిస్తారో లేదో అని అనుమానం వచ్చినా.. కొందరు పెద్దల జోక్యంతో భానుమతి ఓకే చెప్పారు. అయితే.. దీనికి కండిషన్ పెట్టారట భానుమతి. అదికూడా చిత్రంగానే ఉంటుంది. ‘అమ్మాయి పెళ్లి’ చిత్రాన్ని నిర్మించే సన్నాహాల్లో ఉన్నామని, అందులో హీరోగా ఎన్టీఆర్ నటిస్తే, ‘తాతమ్మ కల’ చిత్రంలో తను తాతమ్మగా నటిస్తానని తేల్చి చెప్పారట.
దీనికి ఎన్టీఆర్ అంగీకరించారు. ఆయన తీసుకుంటున్న పారితోషికం ఎంతో తెలుసు కనుక ‘అమ్మాయి పెళ్లి’ చిత్రం కోసం అంతే మొత్తం ఇవ్వడానికి రెడీ అయ్యారు భానుమతి. మరి ‘తాతమ్మ కల’ సినిమా కోసం భానుమతికి ఎంత పారితోషికం ఇవ్వాలి?.. అనే సందేహం వచ్చింది. అయితే.. ఎన్టీఆర్ తీసుకునే పారితోషికం కన్నా.. ఐదు వేలు తగ్గించి ఇవ్వండని భానుమతి చెప్పారు. మొత్తానికి భానుమతి రెమ్యునరేషన్‌లో కరుణించడం అనేది.. ఇదే తొలిసారి.. అని అప్పట్లో టాక్ నడిచింది.