దివంగత లెజెండ్రీ హీరో నందమూరి నటరత్న ఎన్టీఆర్ తన కెరీర్లో ఎంతోమంది హీరోయిన్లతో ఎన్నో సినిమాలలో.. ఎన్నో అద్భుతమైన పాత్రలో నటించారు. అయితే ఏ హీరోయిన్ విషయంలోనూ ఎన్టీఆర్ పై ఎలాంటి రూమర్లు రాలేదు. అయితే ఒక కృష్ణకుమారి విషయంలో మాత్రం ఎన్టీఆర్ పై చాలా వార్తలు వచ్చాయి. కృష్ణకుమారిని ఎన్టీఆర్ ప్రేమించారని.. ఆమెను పెళ్లి చేసుకునేందుకు కూడా సిద్ధమయ్యారని.. అయితే చివరిలో అనూహ్య కారణాలతో ఈ పెళ్లి ఆగిపోయిందన్న విషయం చాలామందికి తెలుసు. అసలు ఎన్టీఆర్ .. కృష్ణకుమారితో ఎందుకు ? ప్రేమలో పడ్డారు దీని వెనక కారణం ఏంటన్న దానిపై ఇప్పటికే చాలా వార్తలు వచ్చినా సీనియర్ సినీ జర్నలిస్టు ఈమంది రామారావు ఒక ఇంటర్వ్యూలో పూసగుచ్చినట్టు వివరించారు.
వాస్తవానికి జయసుధ, జయప్రద, శ్రీదేవి లాంటి హీరోయిన్ల శకం ప్రారంభం కావడానికి ముందు ఎన్టీఆర్ తో నటించేందుకు స్టార్ హీరోయిన్లు ఒప్పుకునే వారు కాదట. భానుమతి – సావిత్రి – అంజలీదేవి లాంటి హీరోయిన్లు పక్కన ఎన్టీఆర్ నటించిన సినిమాలు అన్ని సూపర్ హిట్లు. అయితే తర్వాత అదే హీరోయిన్లు ఎన్టీఆర్‌కు కాల్ సీట్లు ఇచ్చేందుకు ఇష్టపడేవారు కాదట. దీనిపై అప్పట్లో చాలా పుకార్లు వచ్చాయి. ఏఎన్ఆర్ వీరిని చాలా తెలివిగా ఆకట్టుకునే వారని.. సావిత్రిని అయితే ఏకంగా మూడు సంవత్సరాల పాటు డేట్లు బ్లాక్ చేసి ఆమెను మరో హీరో పక్కన నటించకుండా చేశారని కూడా అంటారు.
చివరికి విసిగిపోయిన ఎన్టీఆర్ దేవిక, కృష్ణకుమారి, కెఆర్ విజయ లాంటి హీరోయిన్లను బాగా ప్రోత్సహించే వారిని టాక్. అందుకే కెరీర్ ప్రారంభంలో ఎన్టీఆర్‌కు హీరోయిన్ల దొరక చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి అంటారు. ఈ సమయంలో ఎన్టీఆర్ ఎక్కువగా కృష్ణకుమారితోనే సినిమాలు చేసేవారట. ఆమెలోని మాట తీరు, ఎదుటివారిని నొప్పించని తనం… సంప్రదాయంగా ఉండటం… చాలా సెంట్రిక్‌గా ఎవరి విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం లాంటి అంశాలు ఎన్టీఆర్‌ను అమితంగా ఆకర్షించాయని అంటారు. అందుకే ఎన్టీఆర్ కృష్ణకుమారిని ఇష్టపడటంతో పాటు ప్రేమలో పడిపోయారట.
ఇక ఎన్టీఆర్ భార్య బసవతారకం వరుసగా పిల్లలను కనడంతో ఆమె ఎప్పుడూ నిండు చూలాలి గానే ఉండేదట. ఇది కూడా ఎన్టీఆర్.. కృష్ణకుమారికి దగ్గరవ్వటానికి ఒక కారణంగా రామారావు చెప్పారు. చివరకు తన భార్యను కూడా ఒప్పించి కృష్ణకుమారిని సీక్రెట్ గా పెళ్లి చేసుకునేందుకు ఎన్టీఆర్ ఏర్పాట్లు చేసుకున్నారు. కృష్ణకుమారి కూడా పట్టుచీర కట్టుకుని పెళ్లికూతురులా ముస్తాబు అయింది. ఎన్టీఆర్ మద్రాస్ లోని వడపనీలో పెళ్లి చేసుకునేందుకు పంచ కట్టుకుని పెళ్ళికొడుకుగా ముస్తాబు అయ్యి ఉన్నారు. ఎవరు ఏమనుకున్నా తన రెండో పెళ్లి విషయంలో తన తమ్ముడు త్రివిక్రమరావు అనుమతి ఉండాలని ఎన్టీఆర్ కోరుకున్నారు.
తాను కృష్ణకుమారిని పెళ్లి చేసుకోబోతున్నాను అన్న విషయాన్ని అదే రోజు తమ్ముడికి చెప్పారు. వెంటనే త్రివిక్రమరావు నేను మద్రాసు వచ్చేంతవరకు ఆగమని అన్నగారిని రిక్వెస్ట్ చేశారు. వెంటనే విజయవాడ నుంచి కేవలం నాలుగు గంటల్లో చెన్నైలో నేరుగా కృష్ణకుమారి ఇంటికి వెళ్లి ఆమెకు పిస్టల్ చూపించి కాల్చి చంపేస్తానని బెదిరించారట. తననే ఎన్టీఆర్ ఇష్టపడ్డాడని ఆమె చెప్పారట.
నువ్వు ఎన్టీఆర్ తో మాత్రమే కాదు.. కాంతారావుతో సినిమాలు చేయలేదా ? ఇంకా ఎంతమంది హీరోలతో సినిమాలు చేశావు.. వారందరిని పెళ్లి చేసుకుంటావా ? అని ప్రశ్న వేయడంతో పాటు పెళ్లి ప్రతిపాదన విరమించుకో.. లేకపోతే నిన్ను కాల్చి.. నేను కూడా కాల్చుకుంటానని కరాకండిగా చెప్పేశారట. వెంటనే కృష్ణకుమారి పెట్టే బేడా సర్దుకుని బెంగుళూరుకు షిఫ్ట్ అయిపోయిందట. అలా కృష్ణకుమారి ఎన్టీఆర్ పెళ్లికి త్రివిక్రమరావు బ్రేకులు వేశారు. తర్వాత ఎన్టీఆర్ తన సోదరుడు త్రివిక్రమారావుపై ఆగ్రహం వ్యక్తం చేసినా కాలక్రమంలో తన తమ్ముడు తనకోసం చాలా మంచి పని చేశాడని అనుకునేవారట.