ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ.. అక్కినేనిపై ఏవో వ్యాఖ్యలు చేశారనే వివాదం జరుగుతున్న నేపథ్యంలో .. తెరమీదికి అక్కినేని-ఎన్టీఆర్‌ల మధ్య ఉన్న స్నేహం.. వారి మధ్య అర్థం చేసుకునే తత్వం.. వంటివి చర్చకు వస్తున్నాయి. ఈవిషయాన్ని చెప్పుకొనే క్రమంలో ఒక కీలక విషయాన్ని ప్రస్తావించుకోవాలి. అదేం టంటే.. ఇద్దరూ కూడా తెలుగు తెరమీద హేమాహేమీలే. ఇద్దరూ కూడా చలన చిత్ర రారాజులే!
ఎన్టీఆర్ పౌరాణిక చిత్రాల్లో రారాజు. ఇక సాంఘికాలు సహా ప్రేమ పాత్రల్లో అక్కినేనికి తిరుగులేదు. వీరిద్ద రూ కలసి 14 సినిమాల్లో నటించారు. అయితే, 1977లో వచ్చిన చాణక్య చంద్రగుప్త చిత్రం ఇద్దరికీ కూడా మంచి పేరు తెచ్చింది. ఇక, వివాదాలు.. విభేదాలు పక్కన పెడితే.. అక్కినేని, ఎన్టీఆర్‌లు ఇద్దరూ కూడా.. అన్నదమ్ములుగా మెలిగారు. ఎన్టీఆర్‌కు చాణక్యుని పాత్ర పోషించాలనే కోరిక ఉండేది.
దానికోసం స్క్రిప్టు కూడా సిద్థం చేసుకొన్నారు. అయితే ఆ పాత్ర తను పోషిస్తానని అక్కినేని చెప్పడంతో చాణక్యుడి పాత్ర ఆయనకు ఇచ్చి, తను చంద్రగుప్తుని పాత్ర పోషించారు. రామకృష్ణా స్టూడియోలో ‘చాణక్య-చంద్రగుప్త’ షూటింగ్ చేశారు. తన సొంత సినిమాలో తొలిసారిగా నటిస్తున్న బ్రదర్ అక్కినేనికి తనకంటే ఎక్కువ పేరురావాలని ఎన్టీఆర్ ఎంతో ప్రయత్నించారు.
ఈ అగ్ర నటులు మళ్లీ కలుసుకోవడం తో ఇరువర్గాల అభిమానుల ఆనందానికి అవధులు లేవు. చాణక్య చంద్రగుప్త చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. ఎన్టీఆర్, అక్కినేనిలతో పాటు తమిళ అగ్ర కథానాయ కుడు శివాజీ గణేశన్ కూడా ఈ చిత్రంలో నటించడంతో అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి. అయితే ఆ రేంజ్ లో సినిమా లేకపోవడంతో ప్రేక్షకులు పెదవి విరిచారు. అయినప్పటికీ.. ఎన్టీఆర్-అక్కినేనిల చివరి కాంబినేషన్‌గా ఈ సినిమా గుర్తుండిపోయింది.