ఏ రంగంలో అయినా ఒకరు చేసిన తప్పులు మరొకరికి వరంగా మారతాయి. మనం వదులుకున్న పని మరొకరికి సక్సెస్ ఇచ్చాక మనం ఎంత బాధపడినా.. పెద్ద తప్పు చేశాం ఎంత బాధపడినా ఉపయోగం ఉండదు. చిన్న చిన్న తప్పుల వల్ల కొందరి కెరీర్‌లే ఏకంగా తిరగబడిపోతాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు టాలీవుడ్‌లోనే తిరుగులేని స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. బన్నీ 2003లో గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయం అయినా 2004లో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య సినిమా మనోడికి స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టింది.
ఆర్య సినిమా నుంచి బన్నీ వెనక్కు తిరిగి చూసుకోలేదు. బన్నీ కెరీర్‌కు అంత బలమైన పునాది వేసిన సినిమా ఆర్య. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా.. సుకుమార్ ఈ సినిమాతోనే దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఆర్యకు సీక్వెల్‌గా ఆర్య 2 కూడా ఇదే కాంబినేషన్లో వచ్చింది. అనూరాధా మెహతా హీరోయిన్‌గా నటించిన ఆర్యలో శివబాలాజీ కీలకపాత్రలో కనిపించారు.. ముక్కోణపు ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యింది.
అయితే ఈ సినిమాకు ముందు అనుకున్న హీరో బన్నీ కాదు.. నితిన్. నితిన్ అప్పటికే తేజ దర్శకత్వంలో జయం సినిమా చేసి సూపర్ హిట్ కొట్టాడు. ఈ సినిమాలో సదా హీరోయిన్. తేజ స్వీయ దర్శకత్వంలో వచ్చిన జయం యూత్‌ను ఓ ఊపు ఊపేసింది. గోపీచంద్ విలన్‌గా నటించాడు. అప్పటికే నితిన్ తండ్రి సుధాకర్‌రెడ్డి నైజాంలో టాప్ డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నాడు.
దిల్ రాజు కూడా ఆయనతో ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలో నితిన్‌తోనే ఈ సినిమా చేయాలని కలిశాడు. రాజు బ్యానర్లోనే వచ్చిన తొలి సినిమా దిల్‌లో నితినే హీరో. అలాగే ఆర్యను కూడా నితిన్‌తోనే చేయాలని రాజు అనుకున్నాడు. అప్పటికే దిల్, జయం హిట్లతో నితిన్ ఆరేడు సినిమాలకు పైగా సైన్ చేసేశాడు. మనోడి డేట్లు ఖాళీ లేవు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ కథ చేతులు మారి బన్నీ దగ్గర ఆగింది.
ఒకవేళ ఈ సినిమా ఆ టైంలో నితిన్ చేసి ఉంటే నితిన్ కెరీర్ మరోలా ఉండేది. బన్నీ స్టార్ అవ్వడానికి మరి కొంత టైం పట్టి ఉండొచ్చు. అలా నితిన్ చేసిన చిన్న తప్పుతో బన్నీకి రెండో సినిమాతోనే తిరుగులేని స్టార్ స్టేటస్ వచ్చేసింది.