సినిమా ఇండస్ట్రీ అంటేనే వ్యాపారం. ఇక్కడ ఎవరికి ఎవరితోనూ పెద్దగా సంబంధ బాంధవ్యాలు ఉండవు. ఈ మాట తరచుగా వినిపిస్తుంది. నిజమే. సినిమా ఇండస్ట్రీలో వ్యాపారానికే పెద్దపీట. అయితే.. ఇది ఇప్పటిమాట. కానీ, నాలుగు దశాబ్దాల కిందట విషయాన్ని చూసుకుంటే.. సినిమా అప్పట్లోనూ వ్యాపారమే. అయినప్పటికీ.. సమాజ బాధ్యత, దేశానికి ఏదైనా చేయాలనే తపన కనిపించేవి. ఇక, ఆర్టిస్టుల మధ్య స్నేహ పూర్వక సంబంధాలు కూడా ఉండేవి.
ఒకకి కుటుంబ విశేషాలను మరొకరితో పంచుకోవడం.. ఒకరి సాధక బాధలను మరొకరు షేర్ చేసుకోవడం అనేది కూడా కనిపించేది. పైగా ఇప్పుడున్నట్టుగా.. కుటుంబాలకు కుటుంబాలు సినిమాల్లో లేవు. ఎవరో ఎక్కడి నుంచి వచ్చారో.. అయినా.. కూడా నటన అనే దారం ఇన్ని పూలను ఒక దండగా మార్చింది. ఇలా ఏర్పాటు చేసుకున్న బంధాలు.. సుదీర్ఘ కాలం సాగాయి. ఇగోలు ఉన్నాయి.. ఆదాయంపై వ్యామోహమూ ఉంది.
కానీ, వీటితో పాటు అభిమానం అనే ముడులు కూడా వేసుకున్నారు. ఈ బంధాలను పెంచుకున్నారే తప్ప తెంచుకున్న పరిస్థితి అప్పట్లో లేదు. ఇలా.. ప్రతి పండగ నాడు పనిగట్టుకుని షూటింగులు ఉన్నా లేకున్నా.. నటీనటులు స్టూడియోలకు వచ్చేవారు. ఇక వారి కోసం.. అలనాటి ఫైర్ బ్రాండ్ హీరోయిన్ భానుమతి ప్రత్యేకంగా పిండి వంటలు తేయించి.. తెచ్చేవారు. వీటికి నెయ్యిని జోడించి మరీ దగ్గరుండి తినిపించేవారట.
అన్నగారు రామారావుకి బొబ్బట్లంటే మహా ప్రీతి. ఈ విషయం తెలిసిన భానుమతి ఆయనకు ప్రత్యేకంగా వడ్డించేవారట. ప్రతి బొబ్బట్టుకూ.. చారెడు నెయ్యిపోసి మరీ తినిపించేవారట. ఇక, అలనాటి గయ్యాళి అత్త సూర్యాకాంతం అయితే.. సీజన్ వారీ పచ్చళ్లు పెట్టి తెచ్చేవారట. ఆమే స్వయంగా పెట్టేవారట. ఆవకాయలో 15 రకాల పచ్చళ్లు పెట్టేవారట.
ఇది అతిశయోక్తికాదు. నిజం కూడా. ఏమిటా తిండీ నువ్వూ..
అని ఖసురుకుని మరీ పచ్చడి ముద్దలు తినిపించేవారట. ఇక్కడ మరో ముఖ్య విషయం ఏంటంటే.. హీరో హీరోయిన్లకే వీరి వంటలు పరిమితం అయ్యేవికావు.. లైట్ నుంచి స్వీపర్ల వరకు కూడా అదే అభిమానం చూపించేవారట.