సీనియర్ నటి, దర్శకులు.. భానుమతి గురించి అందరికీ తెలిసిందే. ఆమెకు ముక్కుమీద కోపం. దీంతో సినీ రంగంలో అనేక అవకాశాలను పోగొట్టుకున్నారు. ఇలాంటి వాటిలో కీలకమైన పాత్రలు కూడా ఉన్నా యి. హీరో కృష్ణ నిర్మించిన ‘పండంటి కాపురం’ చిత్రంలో రాణీ మాలినీదేవి పాత్రకు మంచి పేరు వచ్చింది. అహంభావం కలిగిన ఉన్నింటివారి అమ్మాయి పాత్ర అది.
సినిమాలోకి వచ్చేసరికి ఆ పాత్రలో జమున నటించారు. మంచి పేరు కూడా తెచ్చుకున్నారు. అయితే.. వాస్తవానికి ఈ పాత్రకు భానుమతిని ఎంపిక చేసుకున్నారు. అసలు పండంటి కాపురం సినిమాను ముందుండి నడిపించింది.. హీరో కృష్ణ. పైగా.. భానుమతికి, కృష్ణకు మధ్య మంచి అనుబంధం కూడా ఉంది. తమ్ముడు తమ్ముడు అని భానుమతి పిలిచేవారు.
ఈ క్రమంలో భానుమతితో కృష్ణ మాట్లాడితే ఒప్పుకొన్నారు. కొన్ని రోజులు కథా చర్చల్లోనూ భానుమతి పాల్గొన్నారు. అయితే భానుమతితో కృష్ణ సినిమా తీస్తున్నారనే విషయం తెలియగానే కృష్ణ స్నేహితుడు, నిర్మాత కూడా అయిన.. ఒకరు నేరుగా కృష్ణ ఇంటికి వచ్చి ‘భానుమతి అంటే ఎవరనుకున్నావు ? ఆటంబాంబు. ఆవిడతో షూటింగ్ అంటే మాటలుకాదు“ అని చెప్పారట.
గతంలో ‘మిస్సమ్మ’ విషయాన్ని నటశేఖరదగ్గర ప్రస్తావించారు. దీంతో కృష్ణ.. కొన్నాళ్లు ఆలోచనలో పడ్డా… తర్వత.. అనూహ్య కారణాలతో .. భానుమతిని తప్పించారు. బదులు జమునను ఎంపిక చేశారు. ఈ విషయం తెలిసి భానుమతికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తనను ఆ సినిమా నుంచి అర్ధాంతరంగా తొలగించి, వేరే హీరోయిన్‌ను పెట్టుకోవడాన్ని ఆమె సహించలేకపోయారు.
ఆ కోపంలో ‘పండంటి కాపురం’ చిత్రానికి పోటీగా అదే కథతో తనూ ఓ చిత్రం తీయాలని నిర్ణయించుకొన్నారు. ఆ సినిమాను కృష్ణ సినిమాకు పోటీగా రిలీజ్ చేయాలని అనుకుని కథా ప్రయత్నాలు కూడా చేశారు. కానీ, ఎవరూ సహకరించకపోవడంతో దానిని విరమించుకున్నారు.