జయమాలిని అంటే అందరికీ తెలిసిందే. వ్యాంపు పాత్రలకు పెట్టింది పేరు. అప్పట్లో ఈస్ట్‌మన్ కలర్ సినిమాల జోరు పెరిగిన తర్వాత.. ఐటం సాంగులకు పెద్ద ఎత్తున ఆమెను బుక్ చేసుకునేవారు. కానీ, వాస్తవానికి.. జయమాలిని కూడా సినీ రంగంలోకి వచ్చింది హీరోయిన్ పాత్రలకోసమే. ఒకటి రెండు తమిళ చిత్రాల్లోనూ ఆమె హీరోయిన్‌గా పనిచేశారు. అయితే.. అవి అంతగా సక్సెస్ కాలేదు.
తర్వాత.. బి. విఠలాచార్య దర్శకత్వంలో ఆమె నటించారు. ఎందుకంటే.. విఠలాచార్యకు దూర దృష్టి ఎక్కు వ. ఎవరిలో ఏ టాలెంట్ ఉన్నా.. ఆయన ఒడిసి పట్టుకుంటారు. తన మన అనే తేడాలేదని గట్టిగా నమ్మేవారు. టాలెంట్ లేనివారిని కూడా సినీ రంగంలో ఉంటే చాలు.. ప్రోత్సహించేవారు. ఇలా వచ్చిన వారే..పొట్టి ప్రసాద్ లాంటి చాలా మంది ఉన్నారు. “ఏదో ఒక పాత్ర ఇద్దాం. పాపం ఎలా బతుకు తారు!` అనే సింపతీ ఎక్కువ.
ఈ క్రమంలోనే జగన్మోహిని చిత్రంలో జయమాలినికి కీలక రోల్ ఇచ్చారు. దీనికి ముందే ఆమె వ్యాంపు పాత్రలకు సిద్ధమయ్యారు. అయితే..ఈ క్రమంలో ఆమె అప్పట్లో గజదొంగ వంటి సినిమాల్లో నటించారు. ఇప్పట్లా అప్పట్లో వ్యాంపు పాత్రలు అంటే కేవలం పాటలకు మాత్రమే పరిమితం కాదు. కథలో మిళితమై ఉండేవారు. అయితే.. ఒక సందర్భంలో అన్నగారు.. నీలో డ్యాన్స్ టాలెంట్ ఉంది. ఇది చాలా మంది హీరోయిన్లకు లేదు. నువ్వు ఆదిశగా ప్రయత్నం చేయొచ్చుగా అని చెప్పారు.
మరి ఇది ఆమె ఎలా అర్ధం చేసుకుందో తెలియదు కానీ.. చెన్నైలో జయ డ్యాన్స్ స్కూల్ పేరుతో ఒక నృత్య కళాశాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇది బాగా సక్సెస్ అయింది. అయినా.. సినిమాల్లో మాత్రం నటించడం ఆపలేదు. అనేక మంది వర్ధమాన హీరోయిన్లు ఈ స్కూల్ నుంచే రావడం విశేషం.