ఇప్పుడంటే ఒక సినిమా వందల సెంటర్లలో రిలీజ్ అవుతుంది. వేల థియేటర్లలో తొలిరోజే ఆడుతోంది.ఇప్పుడున్నది అంతా డిజిటల్ యుగం.. ఒకప్పుడు ఈ పరిస్థితి లేదు. అప్పుడు ఉన్నదంతా ఫిలిం యుగం. సినిమాలు పెద్ద సెంటర్లలో మాత్రమే రిలీజ్ అయ్యేవి. అక్కడ 100 రోజులు 200 రోజులు ఆడేకే బీ సెంటర్లకు… అక్కడ నుంచి సి సెంటర్లకు.. ఆ తర్వాత టూరింగ్ టాకీస్ లకు ఒక్కటే ఫిలిం ఇచ్చేవారు. అంటే రిలీజ్ అయిన హిట్ సినిమా మారుమూల పల్లెటూర్లకు రావాలంటే కనీసం 6 నెలల నుంచి పది నెలల టైం పట్టేది.
అదే ప్లాప్ సినిమా అయితే కాస్త ముందుగా వచ్చేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు మారుమూల పల్లెటూర్లలో ఉన్న థియేటర్లో కూడా డిజిటల్ అయిపోయాయి. దీంతో ఒకేరోజు ప్రపంచవ్యాప్తంగా వందలాది థియేటర్లలో సినిమా రిలీజ్ అవుతోంది. ఒకప్పుడు సినిమా హిట్ అయిందని చెప్పేందుకు ఎన్ని ? కేంద్రాల్లో 50 రోజులు ఆడింది.. ఎన్ని ? కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. అన్న లెక్కలే కొలమానంగా ఉండేవి. 20 సంవత్సరాల క్రితం చిన్నచిన్న పల్లెటూర్లలో సినిమాలు రిలీజ్ అవ్వటం అంటే పెద్ద సంచలనం.
అలాంటిది గోదావరి జిల్లాలో మారుమూల పల్లెటూరులో రిలీజ్ అయిన బాబాయి బాలకృష్ణ – అబ్బాయి ఎన్టీఆర్ సినిమాలు సెంచరీలు కొట్టాయి. అప్పట్లో ఇదో సంచలనం. ఆ రెండు పల్లెటూర్లలో ఇప్పటికీ బాబాయ్- అబ్బాయి సినిమాల రికార్డులను ఏ టాలీవుడ్ హీరో కూడా బ్రేక్ చేయలేకపోయాడు. బాలకృష్ణ నరసింహనాయుడు సినిమా పశ్చిమగోదావరి జిల్లాలోని మండల కేంద్రమైన కామవరపుకోట చరిత్రలో ఫస్ట్ రిలీజ్. 2001 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా కామవరపుకోటలోని లక్ష్మీ థియేటర్లో 101 రోజులు ఆడింది.
ఆ రోజుల్లోనే ఈ థియేటర్లో రు. 11 లక్షలకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. కామవరపుకోట సినీ చరిత్రలో తొలి రిలీజ్ సినిమాగా… తొలి వంద రోజులు సినిమాగా నరసింహనాయుడు రికార్డుల్లో నిలిచిపోయింది. ఇప్పటికీ ఈ సెంటర్లో మరే సినిమా కూడా 100 రోజులు ఆడలేదు. అలా బాలయ్యకు ఈ సెంటర్లో చెక్కుచెదరని రికార్డు అలా నిలిచిపోయింది. ఆ తర్వాత 2003లో అబ్బాయి ఎన్టీఆర్ నటించిన సింహాద్రి సినిమా ఇదే పశ్చిమగోదావరి జిల్లాలోని నల్లజర్ల మండలం అనంతపల్లి అన్నపూర్ణ థియేటర్లో రిలీజ్ అయింది.
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కూడా అనంతపల్లి చరిత్రలో ఫస్ట్ రిలీజ్ గా నిలిచిపోయింది. సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో అక్కడ ఏకంగా 100 రోజులకు పైగా ఆడింది. ఈ సినిమాకు కూడా అనంతపల్లిలో 12 లక్షలకు పైగా వసూళ్లు వచ్చాయి. అనంతపల్లి కనీసం మండల కేంద్రం కూడా కాదు అలాంటి చోట్ల 20 ఏళ్ల క్రితమే ఎన్టీఆర్ రు. 12 లక్షలతో సంచలన రికార్డు నెలకొల్పాడు. ఇప్పటికీ అలాగే చెక్కుచెదరకుండా ఉండిపోయింది. అలా పశ్చిమగోదావరి జిల్లాలోని కామవరపుకోట- అనంతపల్లిలో బాలయ్య- ఎన్టీఆర్ తమ సినిమాలతో సెంచరీలు కొట్టి చరిత్ర పుటల్లో నిలిచిపోయారు.