ప్రస్తుతం ఉన్నది అంతా సోషల్ మీడియా యుగం… మంచి అయినా, చెడు అయినా క్షణాల్లో వ్యాప్తి చెందుతోంది. ప్రస్తుతం రాజమౌళి, జేమ్స్ క్యామెరూన్ సంభాషణలతో ఉన్న వీడియో సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తోంది. ప్రపంచ మొత్తం మెచ్చిన మాస్టర్ పీస్ అవతార్ దీసిన దర్శకుడే రాజమౌళిని అంతగా మెచ్చుకుంటున్నాడు. ఇది నిజంగా తెలుగు సినిమాకు మాత్రమే కాదు.. భారతీయ సినిమా అంతా గర్వపడాల్సిన విషయం.
కామెరూన్ రెండుసార్లు త్రిబుల్ ఆర్ సినిమా చూసి అందులో సున్నితమైన అంశాల గురించి కూడా ఎంతో గొప్పగా మాట్లాడడం అంటే మామూలు విషయం కాదు. అసలు ఇండియన్ సినిమాల్లోనే బాలీవుడ్ వాళ్లకు సౌత్ సినిమా.. అందులోనూ తెలుగు సినిమా అస్సలు ఆనదు. మనలను అదోలా చూస్తూ ఉంటారు. అలాంటిది తెలుగు సినిమా గురించి హాలీవుడ్ టాప్ డైరెక్టర్ గొప్పగా మాట్లాడడం ప్రపంచమే షాక్ అయ్యింది.
అసలు ఈ క్రేజ్ చూస్తుంటే ఆస్కార్ రాకపోయినా ఈ ప్రశంసలు చాలు అనేలా ఉన్నాయి. ఇటు రాజమౌళి ఆరాధించే వాళ్లలో కామెరూన్‌దే మొదటి స్థానం కూడా..! అయితే కామెరూన్ ప్రశంస… ఇప్పుడు త్రిబుల్ ఆర్ హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్ అభిమానుల మధ్య సోషల్ వార్‌కు దారితీస్తోంది.. కామెరూన్ కొన్ని సన్నివేశాలు, ప్లాష్ బ్యాక్ గురించి చెప్పిన మాటలను పట్టుకుని.. అది తమ హీరోనే స్పెషల్‌గా పొగిడారంటూ ఒకరినొకరు ట్రోలింగ్ చేసుకుంటున్నారు.
నిజానికి కామెరూన్ ఏ హీరోను ప్రత్యేకంగా పొగడలేదు. రాజమౌళి చేసిన ఫిలిం మేకింగ్ గురించి ఆయన పొగిడారే తప్పా యాక్టర్స్ గురించి కాదు. ఆయన ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్, ఇంట్రోసీన్ ప్రస్తావన తెచ్చారు. ప్రత్యేకంగా ఫలానా హీరో అయితే గొప్పగా చేశారు ? అన్న మాట ఎక్కడా వాడలేదు. అయితే ఆ విషయాన్ని అర్థం చేసుకుని హీరోల అభిమానులు ఎవరికి వారు తమ హీరోనే పొగిడారంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటున్నారు.
ఇది నచ్చని మరో హీరో అభిమానులు సోషల్ యుద్ధానికి దిగుతున్నారు. ప్రతి ఒక్క తెలుగు సినిమా అభిమాని గర్వపడాల్సిన టైంలో ఈ ఇద్దరు హీరోల అభిమానులు ఇలాంటి వాదోపవాదాలకు దిగడం ఎంత మాత్రం మంచిదికాదు. –