విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్ చిత్రంలో నటించేందుకు ఎంతోమంది ఎదురు చూసేవారు. అయితే.. ఆయనతో నటించే అవకాశం హీరోయిన్లకు చాలా చాలా తక్కువగా వచ్చేది. అందునా.. ఒకే సినిమాలో తల్లిగా, హీరోయిన్‌గా నటించిన ఏకైక హీరోయిన్.. అప్పటి ఫైర్ బ్రాండ్ నటి.. జమున. `మనుషులంతా ఒక్కటే` సినిమాను దర్శకుడు దాసరి నారాయణరావు.. పట్టాలెక్కించారు.
వాస్తవానికి అన్నగారితో సినిమా తీయాలనేది దాసరికి-అన్నగారికి మధ్య 1973-74లోనే డీల్ ఉండేది. అయితే..అప్పట్లో కొన్ని కారణాలతో ఇది సాధ్యం కాలేదు. ఇక, ఎట్టకేలకు 1975లో మనుషులంతా ఒక్కటే సినిమాను పట్టాలెక్కించారు. ఈ కథ అన్నగారికి బాగా నచ్చింది. అయితే అందులో తల్లి పాత్ర కీలకం. ఆ పాత్ర జమున చేస్తే బాగుంటుందని ఆమెను సంప్రదించారు.
తల్లి పాత్రలు వేయడానికి అప్పట్లో ఆమె అంగీకరించలేదు. ఎందుకంటే.. హీరోయిన్‌గా మంచి ఫామ్‌లో ఉన్నారు. ఈ విషయం తెలిసి.. అన్నగారు కూడా ప్రయత్నించారు. అయినప్పటికీ.. జమున అంగీకరించలేదు. దీంతో ఒకానొక దశలో ఈ సినిమాను విరమించుకున్నారు. అయితే.. దాసరి మాత్రం పట్టుబట్టారు. ఎందుకంటే.. అప్పటికేరెండు సినిమాలు అన్నగారితో చేయాలని అనుకుని చేయలేకపోవడంతో ఇది సెంటిమెంటుగా మారిపోతుందని భావించారు.
ఈ క్రమంలోనే ఆయన రంగంలోకి దిగి జమునను ఒప్పించారు. మనుషులంతా ఒక్కటేలో ఎన్టీఆర్ కు భార్యగా, తల్లిగా ఆమె నటించారు. 1976 ఏప్రిల్ 7 న భారీ ఓపెనింగ్స్ తో మనుషులంతా ఒక్కటే చిత్రం విడుదల అయింది. చిత్రం హిట్ అయింది. ఈ చిత్రంలో జమున, మంజుల కథానాయికలు.
ఈ చిత్ర శత దినోత్సవంలో అన్నగారు మాట్లాడుతూ.. ఈ సినిమాకి హీరో నేను కాదు దాసరే అని ప్రకటించి సంచలనం రేపారు. ఇక, జమున అయితే.. కన్నీటి పర్యంతమైంది. ముందు తాను తల్లిపాత్రకు ఒప్పుకోలేదని, అయితే.. సినిమా చేసిన తర్వాత.. ఏమాత్రం మిస్ అయి ఉన్నా.. ఒక బలమైన పాత్రను కోల్పోయి ఉండేదాన్నని వ్యాఖ్యానించడం గమనార్హం.