అది కరెక్టుగా 2001 సంక్రాంతి టైం. టాలీవుడ్‌లో ముగ్గురు పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ మూడు సినిమాల రిలీజ్‌కు వారం రోజుల ముందు ఓ నిశ్శబ్దం… ఫ్యాన్స్ మధ్య పెద్ద యుద్ధం అన్నట్టుగా నాటి తెలుగుగడ్డ పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా సేమ్ అదే పరిస్థితి కనిపిస్తోంది. ఒకసారి 22 ఏళ్ల క్రిందట చూస్తే మెగాస్టార్ చిరంజీవి నటించిన మృగరాజు, బాలయ్య నరసింహానాయుడు, వెంకటేష్ దేవీపుత్రుడు సినిమాలు రిలీజ్ అయ్యాయి.
ఈ మూడు సినిమాల్లో మృగరాజుకు గుణశేఖర్ డైరెక్టర్. అంతకుముందే చిరంజీవితో చూడాలని ఉంది లాంటి హిట్ సినిమా తీశాడు. ఇక అప్పటికే బాలయ్య, బి.గోపాల్ కాంబినేషన్లో సూపర్ హిట్లు వచ్చాయి. పైగా సమరసింహారెడ్డి తర్వాత వీరి కాంబినేషన్లో వస్తోన్న సినిమా. ఇక శత్రువు లాంటి సూపర్ హిట్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ వెంకటేష్, కోడి రామకృష్ణ కాంబినేషన్లో దేవీపుత్రుడు వచ్చింది. అప్పటికే కోడి రామకృష్ణ దేవీ లాంటి సూపర్ హిట్ సినిమా తెరకెక్కించి ఉండడంతో దేవీపుత్రుడుపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
జనవరి 11న ఒకే రోజు మృగరాజు, నరసింహానాయుడు రిలీజ్ కాగా మృగరాజు తొలి ఆటకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. నరసింహానాయుడు హిట్ అన్నారు. 14న దేవీపుత్రుడు రిలీజ్ అయ్యి గొప్ప టాక్ తెచ్చుకోలేదు. దీంతో నరసింహానాయుడు జనాలకు పిచ్చగా ఎక్కేసి ఇండస్ట్రీ హిట్ అయిపోయింది. అప్పట్లో చిరు, బాలయ్య అభిమానుల మధ్య సినిమాల రిలీజ్‌కు ముందే పెద్ద యుద్ధాలు, పందాలు.. ఇక మధ్యలో వెంకీ సైలెంట్‌గా వచ్చాడు.
ఇక 22 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ తెలుగు నాట సంక్రాంతి కానుకగా బాక్సాఫీస్ దగ్గర అదే తరహా యుద్ధం జరుగుతోంది. చిరు, బాలయ్య నటించిన రెండు సినిమాలు మరో ఆరేడు రోజుల్లో ఒక్క రోజు తేడాలో రిలీజ్ అవుతున్నాయి. మధ్యలో విజయ్ వారసుడు వస్తోంది. ఈ సినిమా నిర్మాత, దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్‌తో పాటు తెలుగు నటులే ఎక్కువ మంది ఉండడంతో అంచనాలు మామూలుగా లేవు.
అప్పుడు రెండు సినిమాల్లో హీరోయిన్ సిమ్రాన్, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ. ఈ సారి కూడా కాకతాళీయంగా రెండు సినిమాల హీరోయిన్ శృతీహాసనే. నిర్మాతలూ ఒక్కరే. ఇప్పుడు నడుస్తోందంతా సోషల్ మీడియా యుగం కావడంతో ఇద్దరు హీరోల అభిమానుల రచ్చ మామూలుగా లేదు. ఇప్పటికే ఈ రెండు సినిమాలు బిజినెస్ పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్‌ల్లో కూడా పోటీ పడుతున్నాయి. 22 ఏళ్ల క్రితం ఈ ఇద్దరు హీరోలు సంక్రాంతికి పోటీ పడినప్పుడు ఎలాంటి నిశ్శబ్ద యుద్ధం చోటు చేసుకుందో ఇప్పుడు అదే సీన్ రిపీట్ అవుతోంది. నాడు బాలయ్య వన్‌సైడ్‌గా విజయం సాధిస్తే.. మరి ఈ సారి ఎవరిది గెలుపు అవుతుందో ? చూడాలి.