ఎన్టీఆర్ నటించిన సాంఘిక చిత్రాల్లో ఆయనకు ప్రత్యేకంగా సమాజం పట్ల ఏదైనా సందేశం ఇచ్చే పాత్రలు ఉండాలని, పాటలు ఉండాలని తపించేవారు. మనం గమనిస్తే.. అన్నగారు ఓల్డ్ డేస్‌లో నటించిన ఏ సినిమా తీసుకున్నా.. ఒక సామాజిక విప్లవానికి సంబంధించిన పాట ఖచ్చితంగా ఉంటుంది. అదే, పౌరాణికం సినిమాలు కానీ, జానపద సినిమల్లో కానీ.. ఇలాంటి అవకాశం లేదు. పాత్రలకు కూడా కుదరదు. దీంతో అన్నగారు.. అప్పట్లో ఖచ్చితంగా తన సాంఘిక సినిమాల్లో ఒక పాటను ఈ కోణంలోనే రాయించుకునేవారు.
అపట్లో దర్శకులు కానీ, నిర్మాతలు కానీ.. అన్నగారంటే ప్రాణం పెట్టేవారు కాబట్టి.. ఆయన సూచనలను తప్పకుండా తీసుకునేవారు. పాత్రలతో సంబంధం లేకుండా కూడా అనేక సామాజిక అంశాలను జోడించి రాయించిన పాటలు ఉన్నాయి. బడి పంతులు సినిమాలో భారత మాతకు జేజేలు.. పాట నుంచి తెలుగు జాతి మనది.. నిండుగ వెలుగు జాతి మనది వరకు అనేక పాటలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు అన్నగారి అభిరుచి.. సామాజిక స్పృహ, చైతన్యం వంటివి కనిపిస్తాయి.
శ్రీకృష్ణ పాండవీయం సినిమాలో వంటి ఫక్తు పౌరాణిక సినిమాలో కూడా చైతన్యవంతమైన పాటను కూర్చారు అన్నారు. “మత్తు వదలరా.. నిద్దుర మత్తు వదలా!“ అనే పాటలో సామాజిక, వ్యక్తుల పట్ల చైతన్యం కనిపిస్తుంది. ఇలానే.. అన్నగారు .. సావిత్రి, అక్కినేని, సూర్యాకాంతంలతో నటించిన సూపర్ డూపర్ హిట్ సినిమా.. గుండమ్మ కథలో లేచింది .. నిద్ర లేచింది.. అనే పాట సీన్ గుర్తుండే ఉంటుంది. ఈ పాట ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది.
నిజానికి ఆ సినిమాలో తొలి నాళ్లలో ఆ పాట లేదు. షూటింగ్ జరుగుతోంది. అన్నగారు సినిమాలో పాటలు విని.. చప్పగా ఉన్నాయని అనడంతో.. వెంటనే దర్శకుడు కమలాకర కామేశ్వరావు.. ఏం చేయమంటారు? అనే చర్చ పెట్టారట. అయితే.. ఆ సమయానికి మహిళలు ఉద్యోగాలకు రావడం.. ఇంట్లో పనులు మగవాళ్లు చేయడంపై సమాజంలో ఎక్కువగా చర్చకు వస్తుండేది.
దీనిని దృష్టిలో పెట్టుకున్న ఎన్టీఆర్.. దీనినే మనం చర్చిద్దాం అన్నారు. అంతే.. మరుసటి పాట రెడీ! దీనికి గాను.. సినిమాలో మళ్లీ షూట్ చేసి.. ఇరికించారు. ఆ తేడా మనకు సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది. సో.. ఈ పాట వెనుక హిస్టరీ ఇదీ. అయితే ఈ పాట ఇప్పటకీ జనాల నోళ్లలో నానేంత సూపర్ హిట్ అయ్యింది.