విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు అన్నగారు ఎన్టీఆర్‌తో అనేక మంది హీరోయిన్లు తెరపంచుకున్నారు. ఎవరి శైలి వారిదే.. ఎవరి ప్రాధాన్యమూ వారిదే. ఇలా.. వచ్చిన వారిలో వాణిశ్రీ ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. అప్పటి వరకు చిన్న చిన్న పాత్రలు చేస్తూ.. సినిమాల్లో కనిపించిన వాణిశ్రీకి తొలిసారి అన్నగారి పక్కన హీరోయిన్‌గా నటించే ఛాన్స్ దక్కింది. ఇలా.. అన్నగారు, వాణిశ్రీ నటించిన నిండు హృదయాలు (1969) తొలిచిత్రం.
విజయవాడలో అప్పట్లో ఒకే సినిమా థియేటర్ ఉండేది. తర్వాత.. మరో దానిని నిర్మించారు. అదే లక్ష్మీటాకీస్. మొదట అది డ్రామా హాలుగా ఉండేది. అన్నగారు ఎస్సారార్ కాలేజీలో చదివే రోజుల్లో సైకిల్ మీద వచ్చి అక్కడ జరిగే నాటకాల్లో పాత్రలు వేసేవారు. అప్పట్నుంచి ఆయనకు ఈ థియేటర్ కు అనుబంధం ఏర్పడింది. ఇక,ఈ థియేటర్ యజమానులలో ఒకరైన మిద్దె జగన్నాథరావుతో అన్నగారికి మరింత స్నేహం ఏర్పడింది.
అప్పట్లో మిద్దె జగన్నాథరావు తొలి ప్రయత్నంగా ఎస్‌వీఎస్ ఫిలిమ్స్ స్థాపించి అన్నగారితోనే తొలి సినిమా తీశారు. ఈ చిత్ర దర్శకుడు కె.విశ్వనాథ్. ఈయన ‘ తొలిచిత్రం ‘ఆత్మగౌరవం’లో హీరో అక్కినేని నాగేశ్వరరావు అయితే.. మలి చిత్రం అన్నగారు. అంతేకాదు.. తర్వాత విశ్వనాథ్ తీసిన నాలుగు సినిమాల్లోనూ రామారావే హీరో కావడం విశేషం.
నిండు హృదయాలు హీరోయిన్‌గా వాణిశ్రీని బుక్ చేశారు. అయితే.. వాస్తవానికి ముందు కృష్ణకుమారిని అనుకున్నారు. కానీ అర్ధంతరంగా కృష్ణకుమారి సినిమాలు మాసేశారు. దీంతో వాణిశ్రీని బుక్ చేయమని అన్నగారే సూచించారట. కానీ, అప్పటికి ఆమె హీరోయిన్ కాదు. పైగా చిన్న చిన్న చెల్లెలి క్యారెక్టర్లు మాత్రమే వేస్తోంది.
వాణిశ్రీ కూడా ఈ అవకాశాన్ని బాగా సద్వినియోగం చేసుకుంది. అన్నగారికి ధీటుగా నటించి.. ఈ జోడీ సూపర్ హిట్ అని పించేలా నటించింది. ఎన్టీఆర్ సైతం ఆమె నటన చూసి కొన్నిసార్లు షాక్ అయ్యేంత గొప్పగా ఆమె ప్రదర్శన ఉందట. ఆ తర్వాత.. అనుకోకుండా శోభన్‌బాబుతో వచ్చిన ఆఫర్లలో నటించి.. అగ్రనాయికగా వాణిశ్రీ నిలవడం గమనార్హం. అలాగే ఏఎన్నార్ – వాణిశ్రీ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు కూడా సూపర్ హిట్‌గా నిలిచాయి.