బ్లాక్ అండ్ వైట్ సినిమా తెరపై ఒక వెలుగు వెలిగి రెండున్నర దశాబ్దాల పాటు తిరుగులేని మేటి నటిగా గుర్తింపు పొందారు మహానటి సావిత్రి. అయితే.. ఎప్పుడూ కూడా అప్పట్లో నటులకు.. అవార్డులపైనా, రివార్డులపైనా పెద్ద ఆసక్తి ఉండేదికాదు. దర్శకులు ఇచ్చే కాంప్లిమెంట్లు, ప్రేక్షకుల నుంచి వచ్చే చప్పట్లతోనే వారు మురిసిపోయేవారు.
ఒకసారి తమిళ సినీ రంగానికి చెందిన పెద్దలు.. సావిత్రికి ఘన సత్కారం ఏర్పాటు చేశారు. ఈ సమయంలోనే ఆమెకు మహానటి బిరుదును ప్రదానం చేశారు. తొలుత ఇక్కడితో అయిపోతుంది కదా.. అని అనుకున్నారు. అది కూడా అన్నగారు ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు చొరవతోనే ఆ అవార్డు అందుకున్నారట. అంతేకాదు.. సినిమాల్లో గడగడా మాట్లాడే సావిత్రికి.. స్టేజ్‌ఫియర్ ఎక్కువగా ఉండేదట.
ఆమె ఎక్కడా బహిరంగ వేదికలపై పెద్దగా మాట్లాడేవారు కాదట. అంతేకాదు.. ఎవరైనా వచ్చి సన్మానం చేయాలని అనుకుంటున్నాం.. అంటే.. ఎంత ఖర్చు పెడుతున్నారు? అని అడిగేవారట. లక్ష రూపాయలు పెడుతున్నాం.. అంటే.. తను మరో 50 వేలు ఇచ్చి.. ఈ సొమ్ముతో అనాథ ఆశ్రమానికి ఏదైనా సాయం చేయండి అని చెప్పి చేయించిన సందర్భాలు కూడా ఉన్నాయని గుమ్మడి రాసిన పుస్తకంలో పేర్కొన్నారు.
సభలు, సన్మానాలకు సావిత్రి వ్యతిరేకమని పేర్కొన్నారు. ఒకప్పుడు పద్మశ్రీ అవార్డుకు మద్రాస్ ప్రభుత్వం సావిత్రి పేరును సిఫారసు చేయిస్తే.. అప్పటి కన్నాంబ వంటి మహానటులకు ఇవ్వకుండా.. తనకు ఇవ్వడం బాగోదని సున్నితంగా తిరస్కరించి.. తన పేరును జాబితా నుంచి తీసేయించుకున్న నటిగా ఆయన పేర్కొన్నారు.