ఎస్వీ రంగారావు మంచి ఫామ్‌లో ఉన్నారు. నిజానికి అప్పటికి.. ఎన్టీఆర్, ఏఎన్నార్ కూడా దూసుకుపోతు న్నారు. అయితే, వీరు రెమ్యునరేషన్ విషయంలో పట్టు బట్టేవారు. కానీ, ఎస్వీఆర్ మాత్రం ముందు డిమాండ్ చేసేవారు. తర్వాత నిర్మాత బతిమాలితే.. తగ్గేవారట. దీంతో ఎక్కువ మంది ఎస్వీఆర్‌ను బుక్ చేసుకునేవారు. అదేసమయంలో సీఎస్ ఆర్ వంటి వారు యాంటి పాత్రలు పోషించినా.. జనాలకు ఎస్వీఆర్ బాగా నచ్చడంతో ఆయనతోనే ఎక్కువగా సినిమాలు తీసేవారు.
ఒక సందర్భంగా హరిశ్చంద్ర సినిమా తీయాలని అనుకున్నారు. దీనికి ఎన్టీఆర్, ఏఎన్నార్.. ఇద్దరిలో ఎవరినో ఒకరిని తీసుకుందామని కథ ప్రిపేర్ చేసుకున్నారు. కానీ, అప్పటికే.. కొన్ని లక్షల సార్లు ఈ కథ నాటకాల రూపంలో గ్రామ గ్రామాన మార్మోగిపోవడం.. కథ అందరికీ తెలిసిందే కావడంతో సినిమా తీయాలని అనుకున్నా.. పెద్దగా పెట్టుబడి పెడితే.. అది కాస్తా బెడిసికొడితే.. ఏం జరుగుతుందో అనే భయం వెంటాడింది.
అయితే, సినిమాగా వస్తే ఆదరణ ఉంటుందని భావించి కొంత సాహసం అయితే చేశారు. మహా కవి గుర్రం జాషువా పద్యాలను వాడుకుందామని నిర్ణయించారు. అప్పట్లో శ్రీశ్రీ అభ్యుదయ కవిత్వానికి ప్రాణం పోస్తే.. గుర్రం జాషువా.. అభ్యుదయం సహా.. అన్ని కోణాలను స్పృశించారు. ఇక, ఈ సినిమాలో ఎన్టీఆర్‌ను ఫైనల్ చేయాలని భావించారు. కానీ, ఆయన అప్పటికే నెలకు 450 తీసుకుంటున్నారు. ఎస్వీఆర్ 550 తీసుకుంటున్నారు.
ఎన్టీఆర్ అయితే.. బడ్జెట్ తక్కువ. కానీ, మొత్తం ఇవ్వాలి. ఎస్వీఆర్ అయితే.. అంతో ఇంతో తగ్గించి ఇచ్చినా తీసుకుంటారు. ఈ కాన్సెప్ట్‌ను మనసులో పెట్టుకుని ఇద్దరినీ సంప్రదించారు. చివరకు ఎస్వీఆర్‌తో ఓకే చేయించారు. అప్పట్లో ఎస్వీఆర్ కథనాయకుడుగా నటించిన సినిమా ఇదే. ఈ సినిమాపై పెద్దగా ఆశలు లేకపోయినా.. సూపర్ హిట్ కొట్టింది. ఎస్వీఆర్‌ను గజారోహణం చేయించి.. చెన్నై వీధుల్లో ఊరేగించి మరీ సన్మానించారు.దీనికి ముఖ్య అతిథి ఎన్టీఆర్ కావడం విశేషం.