సినిమా రంగానికి చెందిన చాలామంది హీరోలు ఎవరైనా డైరెక్టర్ ఫ్లాప్ లో ఉన్నారంటే ఆ డైరెక్టర్ కు ఛాన్స్ ఇవ్వడానికి అస్సలు ఇష్టపడరు. ఫ్లాప్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇవ్వడం అంటే ఒక విధంగా కెరీర్ ను రిస్క్ లో పెట్టడమే అని హీరోలు భావిస్తారు. స్టార్ హీరోలు అయితే నిర్మాతల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని హిట్ డైరెక్టర్ల కాంబినేషన్ కే ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ మాత్రం ఈ మధ్య కాలంలో ఫ్లాపుల్లో ఉన్న డైరెక్టర్లకు సైతం ఛాన్స్ ఇచ్చి ఆయా దర్శకుల కెరీర్ నిలబెడుతున్నారు.
ఈ మధ్య కాలంలో తారక్ కెరీర్ ను పరిశీలిస్తే ఫ్లాప్ డైరెక్టర్లకే ఆయన ఎక్కువగా అవకాశాలను ఇచ్చారు, టెంపర్ సినిమాకు ముందు పూరీ జగన్నాథ్ వరుస ఫ్లాపులతో ఢీలా పడ్డారు. ఆ సమయంలో తారక్ పూరీకి అవకాశమిచ్చి కెరీర్ పరంగా హెల్ప్ చేశారు. ఈ మధ్య కాలంలో పూరీ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో టెంపర్ మూవీ ఒకటనే సంగతి తెలిసిందే. నాన్నకు ప్రేమతో సినిమాకు ముందు సుకుమార్ కూడా 1 నేనొక్కడినే ఫ్లాప్ వల్ల ఇబ్బందులు పడ్డారు.
అయితే నాన్నకు ప్రేమతో సక్సెస్ తర్వాత సుకుమార్ కెరీర్ విషయంలో వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వన్ లాంటి డిజాస్టర్ తర్వాత సుకుమార్‌ను ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేదు. అయినా సుక్కుపై ఎన్టీఆర్ పెట్టుకున్న నమ్మకం నిజమై నాన్నకు ప్రేమతో హిట్ అయ్యింది. ఇక సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్లాప్ తర్వాత బాబీకి అవకాశమిచ్చిన తారక్.. అజ్ఞాతవాసి ఫ్లాప్ తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో అరవింద సమేత సినిమాలో నటించారు. ఆచార్య సినిమా ఫ్లాపైనా ఇచ్చిన మాటకు కట్టుబడి కొరటాల శివ డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు.
మరో స్టార్ హీరో పవన్ కళ్యాణ్ కూడా ఇదే విధంగా చేస్తున్నారు. ఓ మై ఫ్రెండ్ ఫ్లాప్ తర్వాత వేణు శ్రీరామ్ కు అవకాశం ఇచ్చిన పవన్ వకీల్‌సాబ్‌తో పవన్ హిట్ కొట్టడంతో పాటు వేణు శ్రీరామ్ అనే డైరెక్టర్ ఉన్నాడని గుర్తు చేశాడు. ఇక కెరీర్ లో ఒక్క బ్లాక్ బస్టర్ కూడా లేని సాగర్ కె చంద్రకు కూడా అవకాశం ఇచ్చారు. సాగర్ డైరెక్ట్ చేసిన భీమ్లానాయక్ ఎంత హిట్ అయ్యిందో చూశాం.
ఇప్పుడు సాహో ఫ్లాప్ తర్వాత సుజీత్ కు ఛాన్స్ ఇవ్వడానికి ఏ హీరో ఆసక్తి చూపించలేదు. అయితే పవన్ మాత్రం సుజీత్ కు కూడా ఛాన్స్ ఇచ్చారు. ఎన్టీఆర్, పవన్ లాంటి హీరోలు ఇండస్ట్రీకి అవసరమని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.