అన్ని సినిమాలు ఒకేలా ఉండవు. కథ, కథనం మారుతుంది. అదేవిధంగా వాటికి తగిన విధంగా నటులు కూడా మారుతుంటారు. ఇలానే ఎన్టీఆర్ సినిమాల్లోనూ అనేక వైవిధ్యాలు ఉన్నాయి. ఇలా.. వచ్చిన సినిమాల్లో `మనుషులంతా ఒక్కటే` సూపర్ మూవీ. ఈ సినిమాలో అన్నగారు.. ఐశ్వర్య వంతుడైన ఆసామికి కుమారుడు. దీంతో ఆయనకు ఒక్కటే పొగరు, గర్వం. అంతా నాదే అనే టైపు. ఈ సినిమాకు ఓ ప్రత్యేకత కూడా ఉంది. దర్శకరత్న దాసరి నారాయణరావు – ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా ఇదే..!
ఇక, ఇదే సినిమాలో హీరోయిన్‌గా నటించిన జమున పాత్ర కడు బీదరికం నుంచి పుట్టింది. అయినా.. ఆత్మాభిమానంతో పాత్ర పూర్తిగా ఆకట్టుకుంటుంది. ఎన్టీఆర్ తన చేతిలో ఒక చెర్నాకోల్ పట్టుకుని.. దానిని ఝళిపిస్తూ.. ఊరంతా తిరుగుతూ.. బెదిరించడం, తనకు నచ్చిన వాటిని సొంతం చేసుకోవడం.. చేస్తుంటాడు. ఇలాంటి సమయంలో జమున ఎదురుపడడం, ఆమెపైకి కూడా చర్నాకోల్ ఝళిపించడం చేస్తారు.
అయితే, జమున ఎదురు తిరిగి.. నీకు ధనం ఉంటే ఎంత మాకు లేకపోతే ఎంత ? నీలాగా మేం పదిమందిని దోచుకోవడం లేదంటూ.. పేల్చే డైలాగులు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తాయి. దర్శకుడు దాసరి నారాయణరావు అప్పటికే కొన్ని సినిమాలు చేసినా.. ఈ సినిమా మాత్రం.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. అంతేకాదు..ఈ సినిమాలో తండ్రిగా, కుమారుడిగా కూడా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయడం.. జమున గర్వంతో కూడిన యాక్టింగ్ వంటివి సినిమాను వందల రోజులు ఆడేలా చేశాయి.
జమున పొగరుబోతు పాత్రలో ఎన్టీఆర్‌నే ఎదిరించడం.. వీరిద్దరి మధ్య పోటాపోటీ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా రంజిపజేశాయి. ఇక సినిమాలో అనుభవించురాజా – కాలంకాదూ ఖర్మా కాదూ విధి వ్రాసిన రాత కానేకాదూ, మనిషే మనిషికి ద్రోహంచేశాడు – నిన్నేపెళ్ళాడుతా – తాతా బాగున్నావా,ఏం తాతా బాగున్నావా ? – ముత్యాలూ వస్తావా ? అడిగిందీ ఇస్తావా పాటలు హైలెట్ అవ్వడంతో పాటు సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.