టాలీవుడ్‌కు ఈ ఏడాది అస్సలు కలిసి రాలేదు. ఎందరో దిగ్గజనుటలు మృతి చెందుతున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు – సూపర్ స్టార్ కృష్ణ – కైకాల సత్యనారాయణ.. తాజాగా చలపతిరావు మృతి చెందడంతో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. ఇక కృష్ణాజిల్లా గుడివాడ తాలూకాలోని బల్లిపర్రులో ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన చలపతిరావు ముందుగా నాటకాలు వేసేవారు. ఎన్టీ రామారావు ఇచ్చిన ప్రోత్సాహంతో ఆయన వెండితెరపై అడుగు పెట్టారు. ఆ తర్వాత నటనలో మెప్పించి తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు.
టాలీవుడ్ లో ఎంతోమంది స్టార్ హీరోలకు విలన్ గా నటించి మెప్పించారు. ఇక చలపతిరావు తనయుడు రవిబాబు సైతం విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. దర్శకుడుగా ఈరోజు ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఆయన జీవితంలో ప్రేమ పెళ్ళికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆయన ప్రేమ పెళ్లిలో ఎన్నో ట్విస్టులు ఉన్నాయి.
ఆయన బందర్ లో ఇంటర్ చదువుతున్న రోజుల్లో ఓ అమ్మాయి ప్రేమలో పడ్డాడు. చలపతిరావు భార్య పేరు ఇందుమతి. ఆమె ఆయనకు క్లాస్మేట్.
చలపతి రావులో ఏం చూసిందో తెలియదు కానీ.. ఒకరోజు నేరుగా ఆయన దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకుంటావా ? అని అడిగేసారట. వెంటనే షాక్ అయిన ఆయన నేనంటే నీకు ఇష్టమేనా ? అని అడగడంతో ఇందుమతి తల ఊపారట. అప్పుడు చలపతిరావు వయసు కేవలం 19 సంవత్సరాలు. వారిద్దరి మధ్య ప్రేమలేఖలు లాంటివి ఏమీ లేవు. ఇంట్లో చెప్తే ఒప్పుకోలేదట. నీకంటే పెద్దవాడు ఇంట్లో ఉండగా అప్పుడే నీకు ఎలా ? పెళ్లి చేస్తాం అని ఆగ్రహం వ్యక్తం చేశారట.
వారం రోజుల్లో చలపతిరావు స్నేహితులందరూ కలిసి బెజవాడలో సీక్రెట్ గా ఆయనకు ఇందుమతితో పెళ్లి చేసేసారట. ఈ విషయం తెలిసిన చలపతిరావు అన్నయ్య ఒక్కటే ఏడుపు లంకించుకున్నారట. పల్లెటూర్లో అన్నయ్య ఉండగానే తమ్ముడు ప్రేమ పెళ్లి చేసుకున్నాడు అంటే నాకు పిల్లను ఎవరు ఇస్తారని బాధపడుతుంటే తర్వాత చలపతిరావే స్వయంగా తన అన్నకు ఓ అమ్మాయిని చూసి పెళ్లి చేశారట.
ఆ తర్వాత చలపతిరావుతో కలిసి ఆయన భార్య కొన్ని నాటకాలు కూడా వేశారు. అయితే ఆయన భార్య చిన్న వయస్సులోనే మృతిచెందారు. ఆమె చనిపోయే టైంకు రవిబాబు వయస్సు కేవలం 7 సంవత్సరాలు. తర్వాత ఆయనకు పెళ్లి చేసేందుకు చాలా ప్రయత్నాలు జరిగినా పిల్లల కోసం ఆయన పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయారు.