ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు.. తమ ఆరాధ్య దైవం అన్నగారు ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పాలన గురించే కాకుండా.. సినిమాల గురించి కూడా పెద్ద ఎత్తున చర్చలు చేస్తున్నారు. అదే సమయంలో సభలు కూడా నిర్వహిస్తున్నారు. పాలనాపరంగా ఆయన ఎంతగా ప్రజలను ఆకట్టుకున్నారో.. సినీ రంగం పరంగా కూడా.. అన్నగారు తనదైన ముద్ర వేసుకున్నారు.
దీంతో అన్నగారు నటించిన సినిమాల్లోని `అజరామరాలు` పేరుతో పలు ఛానెళ్లు వారానికి ఒక సినిమాను ప్రదర్శిస్తున్నాయి. మరోవైపు.. అమెరికాలో ప్రతి ఆదివారం.. తెలుగు సంఘాలు.. భారీ తెరలు వేసి అన్నగారి చిత్రాలను ప్రదర్శిస్తున్నాయి. ఆయన కీర్తిని స్మరించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఎక్కువగా ప్రాచుర్యం పొందిన రాముడు, కృష్ణుడు వంటి వేషాలతో ఉన్న సినిమాలను ఎక్కువగా ప్రదర్శిస్తున్నారు. అంతేకాదు.. అన్నగారు ప్రతినాయక పాత్రల్లోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
వీటిలో యమ ధర్మరాజు, భీముడు, దుర్యోధనుడు, రావణాసురుడు వంటి పాత్రలు కూడా ఉన్నాయి. దీంతో ఆయా సినిమాలను కూడా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్నగారి శత జయంతిని పురస్కరించుకుని ఆయన నట విశ్వరూపానికిప్రతీకలుగా ఉన్న కొన్ని చిత్రాలనైనా వీక్షించేందుకు ప్రయత్నించాలని.. ఆయన అభిమానులు చెబుతున్నారు.
వీటిలో రాజు పేద, గుండమ్మ కథ, సర్దార్ పాపారాయుడు, బొబ్బిలి పులి, మేజర్ చంద్రకాంత్, గజదొంగ, శ్రీకృష్ణపాండవీయం, సీతారామకళ్యాణం.. వంటి కొన్నింటినైనా వీక్షిస్తే.. విభిన్నమైన పాత్రల్లో ఆయన విశ్వరూపాన్ని చూసి మరోసారి మురిసిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు.