ప్రముఖ హాస్య నటులు.. కనిపిస్తేనే చాలు కడుపుబ్బ నవ్వించే రేలంగి వెంకట్రామయ్య.. ఎన్టీఆర్ ఇద్దరూ కూడా మంచి స్నేహితులు. ఎన్టీఆర్‌ది కృష్ణా జిల్లా అయితే, రేలంగిది పశ్చిమ గోదావరి జిల్లా. అన్నగారికంటే కూడా.. ముందుగానే సినీ ఫీల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు రేలంగి. ముందుగా.. చిన్న చిన్న వేషాలు వేసేవారు. అయితే అసలు ఆయన ఎంట్రీనే ఒక చరిత్ర. సినిమాలకు నటులు, కారెక్టర్ ఆర్టిస్టుల సప్లయర్‌గా ఉన్న పీతాంబరం అనే తమిళియన్‌కు సహాయకుడిగా చేరారట. తర్వాత.. ఒక సందర్భంలో చిన్న వేషానికి వస్తానన్న క్యారెక్టర్ మిస్సయి రేలంగి ఛాన్స్ కొట్టేశారు.
ఇక, అప్పటి తర్వాత రేలంగికి చిన్నచిన్న అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఇలా పుంజుకున్నారు. అయినా కూడా ఆర్టిస్టులను ఇతర ప్రాంతాల నుంచి తీసుకురావడమే తొలి నాళ్లలో ఆయన ప్రధాన కర్త్యవంగా ఉండేదట. నిజానికి హాస్యానికి పుట్టిల్లు రేలంగి అంటే. అతి శయోక్తి లేదు. అలాంటి రేలంగికి.. అన్నగారికి మధ్య సాన్నిహిత్యం ఎక్కువ. తొలినాళ్లలో అన్నగారు మద్రాస్ వెళ్లినప్పుడు పరిచయం చేసుకుని.. ఆయనకు ఆతిథ్యం ఇచ్చింది కూడా రేలంగేనని అంటారు.
ఇక, సినిమాల్లోనూ ఎక్కువగా ఇద్దరూ కలిసి నటించారు. ఇలా కలిసిన మనసులు ఆర్థిక పరమైన అంశాల వరకు కూడా వచ్చాయి. రేలంగి పెద్దగా చదువుకోలేదు. దీంతో ఎవరినీ నమ్మేవారు కాదు. పైగా.. డబ్బులు ధారాళంగా ఖర్చు చేసినా.. అపనమ్మకం ఎక్కువ. పెట్టుబడులు పెట్టాలంటే హడల్. అలాగని వ్యాపారాలు చేయకుండా ఉండేవారు కూడా కాదు. ఇలా.. రేలంగి.. ఒక చిత్రమైన పరిస్థితిలో ఉండేవారు. ఇక, ఏదైనా వ్యాపార సంబంధమైన సలహా లేక ఆర్థిక పరమైన సలహా కోసం.. ఎన్టీఆర్‌ను సంప్రదించేవారట.
ఈ క్రమంలోనే అన్నగారి సూచన మేరకు ఆయన పశ్చిమ గోదావరిలో ఒక సినిమాహాలు కట్టించారు. ఇది కుమారుడు సత్యనారాయణకు అప్పగించేశారు. అయితే.. ఆయనను హీరో చేయాలన్న అన్నగారి సూచనను మాత్రం రేలంగి పక్కన పెట్టేశారు. ఫీల్డ్‌లోకి వస్తే.. వ్యసనాలకు బానిస అవుతారనే భావన ఆయనకు ఉండేది. ఇలా.. రేలంగికి వారసులు ఎవరూ లేకుండా పోయారు. ఇలా తన సలహాను రేలంగి పక్కన పెట్టేశారన్న భావన ఎన్టీఆర్‌కు ఎప్పటకీ ఉండేదట.