సినీరంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన అన్నగారు ఎన్టీఆర్.. తాను ఏ సినిమా చేసినా రెమ్యున రేషన్ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఉండేవారట. ముందుగా ఓ నిర్మాత తాను ఎంత ఇవ్వగలనో చెపితే ఆ రేటుకే ఎన్టీఆర్ సినిమా చేసేందుకు ఓకే చెప్పేవారట. అయితే తనకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్‌ను మాత్రం ఆయన ఖరాఖండీగా తీసుకునేవారట. ఇప్పటి మాదిరిగా అప్పట్లో హీరోలకు అయ్యే ఖర్చును అదనంగా కేటాయించేవారు కాదు.
ప్రస్తుతం టాలీవుడ్‌లో హీరోలకు ఇచ్చే రెమ్యునరేషన్ వేరు.. వారిని తీసుకువచ్చి..తీసుకువెళ్లేందుకు, షూటింగ్ గ్యాప్ మధ్యలో కార్వాన్ ఏర్పాటు, భోజనం ఇలా అనేక ప్రత్యేక సదుపాయాలు ఉండేవి. కానీ, ఓల్డ్ మూవీ షూటింగ్‌ల సమయంలో మాత్రం ఇలా హీరోలను ప్రత్యేకంగా చూసేవారు కాదు. సినిమాలో క్యారెక్టర్ నటుడికి ఎంత ప్రాధాన్యం ఉందో అంతే ప్రాధాన్యం హీరోకు కూడా ఉంటుందని.. అప్పట్లో నిర్మాతలు భావించేవారు.
అందరికీ ఒకే తరహా కుర్చీలు వేసేవారు. ఒకే టెంట్ కింద భోజనాలు అందరూ కలిసి చేసేవారు. ఇక, చిరు అలవాట్లు ఉన్నవారు వారి అభిరుచులకు తగినట్టు వారే కొని తెచ్చుకునేవారు. అన్నగారికి షూటింగ్ గ్యాప్‌లో సిగరెట్ కాల్చే అలవాటు ఉంది. అక్కినేనికి కిళ్లీ అలవాటు ఉంది. సావిత్రికి కూడా పాన్ అలవాటు ఉండేదట. దీంతో వారు తమతమ అలవాట్లకు తగినవి తమే తెచ్చుకునేవారు. రెమ్యూనరేషన్ విషయంలోనూ ఇతర నటులు కొంత అడ్వాన్స్ తీసుకుని.. మిగిలింది సినిమా విడుదలైన తర్వాత తీసుకునేవారట.
కానీ, ఒక్క అక్కినేని, ఎన్టీఆర్ మాత్రం.. రెమ్యునరేషన్‌ను చివరి కాల్ షీట్ నాటికే క్లియర్‌గా తీసేసుకునేవారట. అయితే, ఎప్పుడైనా సినిమాలకు నష్టం వస్తే మాత్రం.. కొంత మొత్తాన్ని వెనక్కి ఇచ్చే సంప్రదాయం ఉండేదట. అది కూడా చిత్తూరు వీ. నాగయ్య ద్వారా తమకు అబ్బిందని చెప్పేవారు. కానీ, ఎన్టీఆర్ మాత్రం దర్శక నిర్మాతల పరిస్థితిని బట్టి ఈ నిర్ణయం తీసుకునేవారట. ఒకవేళ నష్టం భారీగా ఉంటే.. డబ్బులు వెనక్కి ఇవ్వకుండా.. తర్వాత సినిమాలో సర్దుబాటు చేస్తానని చెప్పి అలా చేసేవారట. ఏదేమైనా రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం అక్కినేనిది ఒక విధానం అయితే, అన్నగారు మరో విధానం అనుసరించేవారట.